Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ట్రోఎంటెరైటిస్ సమస్య కారణంగా డిసెంబర్ 16న ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ మినీ వేలంపై ఆసక్తి నెలకొన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం యశస్వి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సూపర్ లీగ్ దశలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించిన కొన్ని గంటలకే అతడికి ఈ ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆ మ్యాచ్‌లో జైస్వాల్ 16 బంతులు ఎదుర్కొని 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
వివరాలు
యశస్వి జైస్వాల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి
సమాచారం ప్రకారం.. మ్యాచ్ ముగిసిన తర్వాత యశస్వి జైస్వాల్‌కు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. క్రమంగా నొప్పి ఎక్కువ కావడంతో అప్రమత్తమైన జట్టు సిబ్బంది అతడిని వెంటనే పింప్రి-చించ్‌వాడ్‌లోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడికి గ్యాస్ట్రోఎంటెరైటిస్, అంటే పొట్ట,పేగులకు సంబంధించిన తీవ్రమైన వాపు ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్సలో భాగంగా జైస్వాల్‌కు ఐవీ ద్వారా మందులు అందించారు. అదేవిధంగా అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం మందులు వాడుతూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
వివరాలు
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ జైస్వాల్ అద్భుత ఫామ్‌లో..
ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యశస్వి జైస్వాల్ మంచి ప్రదర్శననే కనబరిచాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో పాల్గొని 48.33 సగటు,168.6 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ జైస్వాల్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. ఆ సిరీస్‌లో 78సగటుతో 156పరుగులు చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా, మంగళవారం పుణే వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్ 'బి' మ్యాచ్‌లో ముంబై జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. అజింక్య రహానే నాటౌట్‌గా 72 పరుగులు చేయగా, సర్ఫరాజ్ ఖాన్ కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్‌ను ముంబై వైపుకు తిప్పాడు.
వివరాలు
మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలిచిన ముంబై
ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతో ముంబై మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలుపొందింది. రహానే 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో నిలకడగా ఆడాడు. అయితే అసలైన ఆకర్షణగా నిలిచింది సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్. అతడు 7 సిక్సర్లు, 6 ఫోర్లతో తుఫాను బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు విజయవంతంగా ఛేదించింది. మధ్యలో వరుసగా వికెట్లు పడినా, ఒత్తిడిని తట్టుకుని ఆటను కొనసాగించిన ముంబై, ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనింగ్‌లో రహానే, జైస్వాల్ కలిసి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, జైస్వాల్ 15 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
వివరాలు
3 వికెట్లు తీసుకున్నసర్ఫరాజ్
అనంతరం రహానే, సర్ఫరాజ్ ఖాన్ కలిసి కేవలం 39 బంతుల్లోనే 111 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. సర్ఫరాజ్ ఖాన్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌలింగ్‌లోనూ సర్ఫరాజ్ 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడి ఇన్నింగ్స్ తర్వాత ముంబై కొన్ని కీలక వికెట్లు కోల్పోయినా, చివరి వరకూ పోరాడి విజయాన్ని సొంతం చేసుకుంది.