
Yashasvi Jaiswal: ముంబయి జట్టుకి షాక్ ఇచ్చిన యశస్వీ జైశ్వాల్..
ఈ వార్తాకథనం ఏంటి
యువ బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
కొంతకాలంగా ముంబయి తరఫున దేశవాళీ (Domestic Cricket) క్రికెట్ ఆడుతున్న అతడు, అకస్మాత్తుగా ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు.
ఈ నేపథ్యంలో, ముంబయి క్రికెట్ అసోసియేషన్ (Mumbai Cricket Association)కు లేఖ రాసి, గోవా తరఫున ఆడేందుకు నిరభ్యంతర పత్రం(NOC) ఇవ్వాలని అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను జట్టు పాలక వర్గం అంగీకరించినట్లు సమాచారం.
''ఇది ఆశ్చర్యకరమైన పరిణామం.ఇలాంటి నిర్ణయం వెనుక కారణం ఉండొచ్చు. అతని అభ్యర్థనను అంగీకరించి ముంబయి జట్టులోనుంచి రిలీవ్ చేశాం,'' అని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు బుధవారం పీటీఐకి తెలిపారు.
వివరాలు
గోవా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం
వ్యక్తిగత కారణాల వల్లే జట్టు మారుతున్నట్లు జైస్వాల్ తన లేఖలో పేర్కొన్నాడు. ఫలితంగా, 2025-26 సీజన్ నుంచి ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ గోవా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు.
ఇటీవల దేశవాళీలో ముంబయి జట్టును వీడిన మూడో ఆటగాడిగా జైస్వాల్ మారాడు.
2022-23 సీజన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్, మరో క్రికెటర్ సిద్ధేశ్ లాడ్ కూడా ముంబయిని వదిలి గోవా చేరారు.
తాజా పరిణామాలపై గోవా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శాంబ దేశాయ్ స్పందిస్తూ, జైస్వాల్‌ను తమ జట్టులోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో అతడు గోవా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని పేర్కొన్నారు.
వివరాలు
దేశవాళీ క్రికెట్‌లోనూ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆడాలి: బీసీసీఐ
జైస్వాల్ 2019లో ముంబయి జట్టులో చేరి అన్ని ఫార్మాట్లలో కలిపి 63 మ్యాచ్‌లు ఆడాడు.
అందులో, రంజీలో 10, లిస్ట్-ఏలో 25, టీ20ల్లో 28 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
రంజీలో 863 పరుగులు సాధించగా, ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇటీవల బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లోనూ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆడాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ 4, 26 పరుగులతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.