IND vs NZ: ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగిన యువ బౌలర్.. కోహ్లీ ఎంట్రీతో సీన్ రివర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) ఇచ్చిన అగ్రెసివ్ సెండాఫ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (Tim Seifert) వికెట్ తీసిన అనంతరం బ్రార్ ఆవేశంగా ప్రవర్తించాడు. దీంతో సీఫెర్ట్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. అయితే పరిస్థితి చేయి దాటకముందే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) జోక్యం చేసుకుని బ్రార్‌ను పక్కకు తీసుకెళ్లాడు. దీంతో మైదానంలో జరగబోయే గొడవకు అడ్డుకట్ట పడింది.
వివరాలు
వికెట్ తీసిన తర్వాత బ్రార్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ (Bay Oval) వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరిగింది. 12వ ఓవర్ చివరి బంతికి గుర్నూర్ బ్రార్ వేసిన బంతిని సీఫెర్ట్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి సరిగ్గా బ్యాట్‌కు తగలకపోవడంతో గాల్లోకి లేచింది. దీంతో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సులభంగా క్యాచ్ అందుకోగా సీఫెర్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.
మ్యాచ్ ఆరంభం నుంచే సీఫెర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడికి, గుర్నూర్ బ్రార్‌కు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
వికెట్ పడటానికి కొద్దిసేపటి ముందే సీఫెర్ట్ బౌండరీ బాదడంతో బ్రార్ కొంత అసహనానికి గురయ్యాడు.
వివరాలు
వెంటనే జోక్యం చేసుకున్న విరాట్ కోహ్లీ
సీఫెర్ట్ వికెట్ దక్కగానే బ్రార్ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. అతడి వైపు నడుచుకుంటూ వెళ్లి గట్టిగా అరుస్తూ అగ్రెసివ్‌గా సెండాఫ్ ఇచ్చాడు.
బ్రార్ ప్రవర్తనతో అసంతృప్తికి గురైన సీఫెర్ట్ కూడా గొడవకు సిద్ధమైనట్లు కనిపించాడు. ఈ పరిణామాన్ని గమనించిన విరాట్ కోహ్లీ వెంటనే జోక్యం చేసుకున్నాడు.
తన యువ సహచరుడు బ్రార్‌ను పక్కకు లాక్కెళ్లి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అడ్డుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
కోహ్లీ బ్రార్‌ను శాంతింపజేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ.. ఈసారి మాత్రం శాంతిదూతలా మారి గొడవను ఆపడం విశేషం. ఈ పరిణామంపై కామెంటేటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.