LOADING...
WPL: యువ స్పిన్నర్‌ శ్రీ చరణికి జాక్ పాట్.. డబ్బులు వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
యువ స్పిన్నర్‌ శ్రీ చరణికి జాక్ పాట్.. డబ్బులు వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్

WPL: యువ స్పిన్నర్‌ శ్రీ చరణికి జాక్ పాట్.. డబ్బులు వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌ (WPL) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌కు గర్వకారణమైన క్షణాన్ని అందించింది. కడపకు చెందిన భారత యువ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు ఆమె గతంలో ఆడిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) ఏకంగా రూ.1.30 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చుచేసి ఆమెను తిరిగి జట్టులోకి తీసుకుంది.

Details

ఆమె విలువకు అసలైన ప్రమాణం 

మొద‌ట్లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా కేవలం రూ.50 లక్షల బేస్‌ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌లో చోటు దక్కించుకున్న శ్రీ చరణి, గత సీజన్‌ ప్రదర్శనతో పాటు తాజా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమె, తన ఖచ్చితమైన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థులను గందరగోళానికి గురి చేసింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆమె ఒకరిగా నిలిచింది.

Details

వేలంలో అంచనాలకంటే భారీ పోటీ 

శ్రీ చరణి ఇటీవలి రీతిలో చూపిన ఫామ్‌, బౌలింగ్‌లోని వైవిధ్యం కారణంగా ఆమె ధర కోటి మార్క్‌ను సులభంగా దాటుతుందని వేలం ముందు నుంచే విశ్లేషకులు అంచనా వేశారు. వేలం ప్రారంభమైన వెంటనే అనేక ఫ్రాంచైజీల ఆసక్తి స్పష్టమైంది. ముఖ్యంగా పర్స్‌లో పరిమిత నిధులు ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌, కొత్త జట్టును బలోపేతం చేసుకోవాలనుకున్న యూపీ వారియర్స్‌ మధ్య హోరాహోరీ బిడ్‌ కొనసాగింది. రూ.1 కోటి మార్క్‌ దాటిన తర్వాత కూడా పోటీ తగ్గకుండా కొనసాగి చివరకు రూ.1.30 కోట్ల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ బిడ్‌ విజయవంతమైంది.

Advertisement

Details

స్పిన్‌ విభాగాన్ని మరింత బలపర్చడమే డీసీ వ్యూహం

మిగతా జట్లతో పోలిస్తే తక్కువ పర్స్‌ ఉన్నప్పటికీ, శ్రీ చరణి వంటి ఫామ్‌లో ఉన్న దేశీయ మ్యాచ్‌విన్నర్‌పై పెట్టుబడి పెట్టడంలో ఢిల్లీ యాజమాన్యం వెనుకడలేదు. ఆమెను జట్టులోకి తిరిగి తీసుకోవడం ద్వారా స్పిన్‌ విభాగాన్ని మరింత బలపర్చడమే డీసీ వ్యూహం. జట్టులో ఇప్పటికే జెమీమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మ వంటి స్టార్లు ఉన్నప్పటికీ, వికెట్లు తీయగలిగే స్థిరమైన స్థానిక స్పిన్నర్‌ ఆవశ్యకతను ఈ కొనుగోలు తీర్చినట్లే.

Advertisement

Details

  21 ఏళ్లకే అరుదైన గుర్తింపు 

ఇంత చిన్న వయస్సులో వరల్డ్‌ క్లాస్‌ ప్రదర్శన ఇవ్వడం, ఇప్పుడు WPLలో కోట్ల మార్క్‌ దాటిన ధరకు అమ్ముడవడం - ఇవన్నీ శ్రీ చరణి ఎదుగుదలకు నిదర్శనం. గత సీజన్‌లో డీసీ ఫైనల్‌ చేరడంలో ఆమె విలువైన పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి అదే జట్టులో చేరడం ద్వారా ఆ స్థిరత్వాన్ని కొనసాగించే అవకాశం లభించింది. కడప నుంచి వచ్చి WPL మెగా వేలంలో ఇంత భారీ ధర పలకడం, రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు పెద్ద ప్రేరణ. 2026 సీజన్‌లో శ్రీ చరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంతటి విజయాలు అందిస్తుందో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది

Advertisement