Page Loader
CT 2025: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అఫ్గానిస్తాన్‌ మెంటార్‌గా పాక్‌ దిగ్గజం
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అఫ్గానిస్తాన్‌ మెంటార్‌గా పాక్‌ దిగ్గజం

CT 2025: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అఫ్గానిస్తాన్‌ మెంటార్‌గా పాక్‌ దిగ్గజం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మెగా టోర్నీకి జట్టు మెంటార్‌గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను నియ‌మించింది. ఈ విషయాన్ని బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. "ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు యూనిస్ ఖాన్ అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పని చేస్తారు. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు అతడు జట్టుతో కలుస్తాడు," అని అఫ్గాన్ క్రికెట్ ప్రతినిధి సయీద్ నసీమ్ సాదత్ తెలిపారు. గతంలో 2022లో యూనిస్ ఖాన్ అఫ్గాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించారు.

వివరాలు 

జడేజా మార్గదర్శకత్వంలో వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుత ప్రదర్శన

వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గాన్ జట్టు మెంటార్‌గా ఉన్న భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాతో ఈసారి ఒప్పందం కొనసాగలేదు. జడేజా మార్గదర్శకత్వంలో అఫ్గానిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఓడించి సెమీఫైనల్ చేరేందుకు దగ్గరలోనే నిలిచింది. జడేజా పాత్ర అఫ్గాన్ విజయాల్లో కీలకంగా నిలిచింది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుండడంతో, వీసా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కారణంగా, యూనిస్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై ఏసీబీ మొగ్గు చూపింది.

వివరాలు 

యూనిస్ ఖాన్‌ నాయకత్వంలో పాకిస్తాన్ 2009 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది

యూనిస్ ఖాన్‌కు కోచ్‌గా విశేష అనుభవం ఉంది. గతంలో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన అతడు, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ, అబుదాబి T10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ వంటి జట్లతో కూడా కలిసి పని చేశాడు. యూనిస్ ఖాన్ తన కెరీర్‌లో 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించారు. అతడి నాయకత్వంలో పాకిస్తాన్ 2009 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ అనుభవం అఫ్గాన్ జట్టుకు కీలకంగా సహాయపడుతుందని ఆశిస్తున్నారు.