Page Loader
#NewsBytesExplainer: బెట్టింగ్​లో యువత!.. ఆన్‌లైన్ మాయాజాలంలో ఎలా చిక్కుకుంటున్నారు?
బెట్టింగ్​లో యువత!.. ఆన్‌లైన్ మాయాజాలంలో ఎలా చిక్కుకుంటున్నారు?

#NewsBytesExplainer: బెట్టింగ్​లో యువత!.. ఆన్‌లైన్ మాయాజాలంలో ఎలా చిక్కుకుంటున్నారు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యాపారం పెచ్చరిల్లిపోతోంది. వేలాది మంది యువత, పిల్లలు దీనికి బానిసలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఆర్థిక నష్టాల కారణంగా చాలా మంది నిరాశలో మునిగిపోతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలంలో పడినవారిలో ఎవరు బాధితులుగా ఉన్నారో వారి కుటుంబసభ్యులకు కూడా తెలియకపోవడం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, పెద్దలు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ, అసలు బెట్టింగ్ మాయలోకి వ్యక్తిని ఎలా లాగుతారు? ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? చివరకు ఈ ప్రమాదకర ఆట ఎలా ముగుస్తుంది? అన్నది పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

Details

బెట్టింగ్ గాలం ఎలా వేస్తారు?

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది. వాటిలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. బెట్టింగ్ యాప్స్‌కు ఇవే ప్రధానమైన ప్లాట్‌ఫామ్‌లుగా మారాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. 'బెట్టింగ్ పెట్టండి, నిమిషాల్లో లక్షలు గెలుచుకోండి' అంటూ ఆకర్షణీయమైన యాడ్స్‌తో యువతను ఆకట్టుకుంటాయి. ఈ ప్రకటనల్లో సినీ తారలు, క్రికెటర్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపే వ్యక్తులను ఉపయోగిస్తూ నమ్మకాన్ని కలిగిస్తారు. సెర్చ్ ఇంజిన్లలో కూడా ఈ యాడ్స్ విస్తృతంగా కనిపిస్తాయి. దీంతో ఈజీ మనీ ఆశతో యువత ఈ వలలో పడిపోతారు.

Details

యాప్ డౌన్‌లోడ్‌తో మొదటి అడుగు

ప్రకటనల ప్రభావంతో కొందరు ఆసక్తి చూపి బెట్టింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు. యాప్ స్టోర్, వెబ్‌సైట్ లేదా థర్డ్ పార్టీ లింక్ ద్వారా ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ అవుతాయి. అకౌంట్ క్రియేట్ చేయడానికి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఇవ్వడంతో పాటు షరతులన్నింటిని అంగీకరించాలి. ఆపై డిపాజిట్ కోసం క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దశ పూర్తయితే, ఇక అసలు బెట్టింగ్ ప్రారంభమవుతుంది.

Details

 'కాయ్ రాజా కాయ్' - బెట్టింగ్ మొదలు

యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చాక, యూజర్లు అందులో అందుబాటులో ఉన్న బెట్టింగ్ రకాల గురించి తెలుసుకుంటారు. క్రికెట్ మ్యాచ్‌లు, క్యాసినో గేమ్స్, రాజకీయ ఎన్నికల ఫలితాలు, ఇతర సంఘటనలపై పందేలు కాస్తారు. ఎంత డబ్బును బెట్టింగ్‌గా పెట్టాలో నిర్ణయించి, ఫలితాల కోసం వేచిచూస్తారు. తొలుత చిన్న మొత్తాలతో ప్రారంభించి, ఆపై భారీగా డబ్బు పెట్టేలా ప్రోత్సహిస్తారు.

Details

 మోసపు బెట్టింగ్ యాప్స్ - ఎలా మోసం చేస్తాయి?

ఈ బెట్టింగ్ యాప్స్ మూడురకాలుగా మోసం చేస్తాయి 1. తొలుత గెలిపించి, ఆపై మోసం ప్రారంభంలో చిన్న మొత్తాలతో గెలిపించి, పెద్ద మొత్తాలు పెట్టేలా ప్రేరేపిస్తాయి. ఎక్కువ బోనస్‌లు ఇస్తామని చెప్పి మరింత డబ్బు డిపాజిట్ చేయించుకుంటాయి. భారీ డిపాజిట్ చేసిన తర్వాత అకౌంట్ బ్లాక్ చేయడం లేదా డబ్బు విత్‌డ్రా కాకుండా చేయడం జరుగుతుంది. 2. వ్యక్తిగత డేటా దొంగిలింపు యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరిస్తాయి. ఫోన్ హ్యాక్ చేసి ఫైనాన్షియల్ అకౌంట్స్‌ను ఖాళీ చేస్తాయి. సేకరించిన డేటాను మూడోపక్షాలకు విక్రయించడం ద్వారా దుర్వినియోగం చేస్తాయి.

Details

3. నకిలీ గేమింగ్ యాప్స్ 

ఆటలను ముందే ప్రోగ్రామ్ చేయడం వల్ల యూజర్లు గెలిచే అవకాశం ఉండదు. ఫలితాలను యాప్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. బెట్టింగ్ పై నిబంధనలు లేవా? తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి. కానీ, పలు ఇతర రాష్ట్రాల్లో ఇంకా నడుస్తున్నాయి. సోషల్ మీడియా, ప్రముఖ వ్యక్తులు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పోలీసులు పలుమార్లు బెట్టింగ్ ముప్పును గురించి తెలియజేశారు. అయినప్పటికీ కొత్తగా మోసపోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Details

 జీవితాలు వినాశనం

బెట్టింగ్ అనేది ఓ ఊబి లాంటిది. ఒకసారి అందులోకి దిగితే, బయటకు రావడం చాలా కష్టం. సంపాదించిన డబ్బంతా పోగొట్టుకోవడమే కాకుండా, అప్పులు చేసి మరింత ప్రమాదంలో పడిపోతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయి. కొందరు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శిక్షలు తప్పవు బెట్టింగ్ నిర్వహించే వారు, ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారు ఇద్దరూ శిక్షార్హులే. బెట్టింగ్ ప్రోత్సహించినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముంది. కాబట్టి, అందరూ ఇలాంటి అక్రమ వ్యాపారాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Details

సహజ సంపాదనకే ప్రాధాన్యం ఇవ్వాలి

బెట్టింగ్‌ ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశలతో చాలా మంది యువత దారితప్పుతున్నారు. కానీ, ఇది ఒక ప్రమాదకరమైన లూప్. శ్రమతో సంపాదించిన ధనం మాత్రమే మన జీవితాల్లో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి, బెట్టింగ్ మాయాజాలం నుంచి దూరంగా ఉండి, సమాజాన్ని అప్రమత్తం చేయడం అవసరం.