Denmark: డెన్మార్క్ అడవిలో వెలుగుచూసిన వెయ్యేళ్ల నాటి వైకింగ్ బంగారు నిధి
ఈ వార్తాకథనం ఏంటి
డెన్మార్క్‌లో వెలుగులోకి వచ్చిన వెయ్యేళ్ల నాటి బంగారు నిధి ప్రస్తుతం ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైకింగ్ యుగానికి చెందిన ఈ అరుదైన సంపద డెన్మార్క్ చరిత్రలో కీలక ఆవిష్కరణగా నిలుస్తోంది. హిమ్మర్‌ల్యాండ్ ప్రాంతంలోని 'రోల్డ్ స్కోవ్' అడవిలో ఓ వ్యక్తికి తొలుత కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పురాతత్వ శాస్త్రవేత్తలు మెటల్ గుర్తింపు పరికరాలతో అక్కడ పరిశీలనలు చేపట్టగా,మొత్తం 762.5 గ్రాముల బరువున్న ఆరు భారీ బంగారు కడియాలు బయటపడ్డాయి. నిపుణుల పరిశీలనలో ఇవి 10వ శతాబ్దానికి చెందినవని తేలింది. ముఖ్యంగా ఈ ఆభరణాలు వైకింగ్ పాలకుడు 'హరాల్డ్ బ్లూటూత్' కాలానికి చెందినవై ఉండొచ్చని భావిస్తున్నారు.
వివరాలు
వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు
డానిష్ చరిత్రలో ఇప్పటివరకు లభించిన వైకింగ్ బంగారు నిధుల్లో ఇది మూడవ అతిపెద్ద నిధిగా గుర్తింపు పొందింది. నార్త్ జట్‌లాండ్ మ్యూజియం ప్రతినిధి టోర్బెన్ సారౌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరు కడియాలు ఒకే తరహా నైపుణ్యంతో తయారయ్యాయి. అప్పటి అత్యంత ధనికులు లేదా ప్రభావశీలమైన వైకింగ్ ప్రభువులు వీటిని ఉపయోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆ కాలానికి చెందిన వెండి ఆభరణాలే ఎక్కువగా బయటపడుతుంటాయి. అయితే ఇంత భారీ పరిమాణంలో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు లభించడం చాలా అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు
మరోవైపు, ఈ నిధి సమాధుల వద్ద కాకుండా అడవి దారిలో లభించడం ఆసక్తికరంగా మారింది. శత్రువుల దాడుల భయంతో వీటిని దాచిపెట్టి ఉండవచ్చని, లేదా దేవతలకు సమర్పించిన కానుకలుగా అక్కడ ఉంచి ఉండవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెన్మార్క్ చట్టాల ప్రకారం చారిత్రక విలువ కలిగిన వస్తువులను ప్రభుత్వానికి అప్పగించడం తప్పనిసరి. దీంతో ఈ బంగారు కడియాలను డెన్మార్క్ జాతీయ మ్యూజియంకు తరలించారు. ప్రస్తుతం అక్కడి నిపుణులు వాటి తయారీలో ఉపయోగించిన లోహ మిశ్రమాలు,ఆ కాలం నాటి కళా నైపుణ్యంపై లోతైన పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వెయ్యేళ్ల నాటి ఈ బంగారు నిధి ద్వారా అప్పటి సామాజిక పరిస్థితులు,సంపద పంపిణీ, వైకింగ్ సంస్కృతి గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.