Page Loader
Japan:ట్రక్ డ్రైవర్‌ను కాపాడాలి..ప్లీజ్ నీరు వాడకండి..12లక్షలమందిని కోరిన జపాన్ 
ట్రక్ డ్రైవర్‌ను కాపాడాలి..ప్లీజ్ నీరు వాడకండి

Japan:ట్రక్ డ్రైవర్‌ను కాపాడాలి..ప్లీజ్ నీరు వాడకండి..12లక్షలమందిని కోరిన జపాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌లో (Japan) ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, అక్కడి అధికారులు తమ ప్రజలను నీటిని తక్కువగా వినియోగించాలని అభ్యర్థించారు. యాషియో ప్రాంతంలోని 12 లక్షల మందిని ఈ విజ్ఞప్తి చేశారు. ఇంతకు ఏమైంది? జపాన్‌లోని యాషియో ప్రాంతంలో భూమి కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో ఓ ట్రక్ డ్రైవర్‌ (Truck Driver) సహా ట్రక్కు ఆ గుంతలో పడిపోయింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా, అతడిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, భూమి గుల్లగా ఉండటం వల్ల రక్షణ చర్యలు సవాల్‌గా మారాయి. పక్కనే మరో గుంత ఏర్పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

వివరాలు 

అధికారుల విజ్ఞప్తి 

అధికారుల అంచనా ప్రకారం, మురుగు నీటి పైప్‌ పగిలిపోవడం వల్ల భూమి కుంగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ట్రక్కును వెలికితీసినప్పటికీ,క్యాబిన్‌ లోపలే ఉండిపోయిన డ్రైవర్‌ను ఇంకా బయటకు తీయలేదు. "ఇక్కడ మన ప్రాధాన్యత వ్యక్తి ప్రాణాలను రక్షించడమే. కాబట్టి,స్నానం,లాండ్రీ (showers and laundry) వంటి అత్యవసరం కాని పనులకు దూరంగా ఉండాలని,వీలైనంత తక్కువ నీటిని వినియోగించాలని ప్రజలను కోరుతున్నాం. సహాయక చర్యలకు అంతరాయం కలుగకుండా మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది" అని అధికారులు ప్రకటించారు. 74 ఏళ్ల డ్రైవర్ నుంచి కొద్దిగంటలుగా ఎటువంటి స్పందన లేదని వెల్లడించారు. భూమి చాలా వదులుగా ఉండటంతో భారీ మెషినరీని ఉపయోగించలేకపోతున్నామని,అయినప్పటికీ అతడిని కాపాడేందుకు సహాయక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.