Loading...
US Flights Ground Stop: అమెరికాలో 11 వేల విమానాలు నిలిపివేత.. అసలేం జరిగింది?
అమెరికాలో 11 వేల విమానాలు నిలిపివేత.. అసలేం జరిగింది?

US Flights Ground Stop: అమెరికాలో 11 వేల విమానాలు నిలిపివేత.. అసలేం జరిగింది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 11 వేల విమానాలు కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సమస్య కారణంగా విమాన సేవలను నిలిపివేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని, విమాన సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు

11 వేల విమానాలపై ప్రభావం

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ సమస్య తలెత్తింది.

ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థల్లో సాంకేతిక లోపం కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేయాలని FAA అధికారులు ఆదేశించారు. ఈ పరిణామంతో వేలాది విమాన సర్వీసులపై ప్రభావం పడింది.

ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ 'ఫ్లైట్ అవేర్' డేటా ప్రకారం.. దాదాపు 10 వేల విమానాలు ఆలస్యమయ్యాయి.

మరో వెయ్యి విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొత్తంగా దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.

వివరాలు

ఓవర్‌లోడ్ కారణంగానే సాంకేతిక వైఫల్యం

అమెరికాలోని 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.

కాలం చెల్లిన టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు, ఓవర్‌లోడ్‌కు గురైన స్విచ్‌లు, రూటర్ల కారణంగా ఈ సాంకేతిక వైఫల్యం ఏర్పడినట్లు అమెరికా రవాణా మంత్రి సీన్ డఫీ తెలిపారు.

అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు చాలా పాతవని, ఇప్పటికీ అనలాగ్ సిస్టమ్స్‌పైనే ఆధారపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

డేటా పరిమాణం ఎక్కువైనప్పుడు ఓవర్‌లోడ్ సమస్య తలెత్తుతోందని వివరించారు. ఈ సందర్భంగా సీన్ డఫీ మాట్లాడుతూ.. ఈ సమస్య కారణంగా రాడార్లు, టెలికమ్యూనికేషన్ సామర్థ్యాలను పూర్తిగా కోల్పోలేదని స్పష్టం చేశారు.

అయితే విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు

ADVERTISEMENT

వివరాలు

నాలుగు గంటల తర్వాత గ్రౌండ్ స్టాప్ ఎత్తివేత

FAA అధికారులు విమానాల టేకాఫ్‌లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన సమయంలో దాదాపు 3,500 విమానాలు గాల్లో ఉన్నాయి.

వాటన్నింటినీ అత్యవసరంగా సమీపంలోని విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన అనంతరం దాదాపు నాలుగు గంటల తర్వాత FAA తన గ్రౌండ్ స్టాప్ ఆదేశాలను ఎత్తివేసింది.

దీంతో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్‌లైన్లకు అనుమతి లభించింది.

అయితే, విమాన రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

సైబర్ దాడి కాదు: ట్రంప్ స్పష్టీకరణ

అమెరికాలో విమాన సేవలకు అంతరాయం కలగడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సమస్యకు సైబర్ దాడి లేదా కృత్రిమ మేధ (AI) కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన సమయంలోనే అమెరికాలో విమాన సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే విమాన సేవలకు ఏర్పడిన అంతరాయానికి తమ సర్వీసులతో ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

వివరాలు

గతంలోనూ నిలిచిపోయిన విమాన సేవలు

అమెరికాలో ఇలాంటి సాంకేతిక సమస్య గతంలోనూ తలెత్తింది. 2023 జనవరిలో సాంకేతిక వైఫల్యం కారణంగా FAA అధికారులు ఎయిర్‌లైన్లకు నోటమ్ (NOTAM) జారీ చేశారు.

దీంతో వేలాది విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. ఇక 2001 సెప్టెంబరు 11న అమెరికాలో జరిగిన భీకర ఉగ్రదాడుల సమయంలోనూ దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను ఇదే విధంగా నిలిపివేశారు.

అయితే ప్రస్తుత పరిణామాలను మరో 9/11 ఘటనగా భావించాల్సిన అవసరం లేదని ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు.

ADVERTISEMENT