ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి.. ధ్రువీకరించిన హమాస్
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమస్ చేతిలో ఉన్న బందీలు మరణించారు. ఈ విషయాన్ని హమస్ సంస్థ ధ్రువీకరించింది. గత 24 గంటల్లో గాజా స్ట్రిప్ నార్త్ విభాగంలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 13 మంది బందీలు మరణించారని హమస్ తెలిపింది. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 13 మంది చనిపోయారని, మృతుల్లో ఇజ్రాయెల్ పౌరులతో పాటు బందీలు ఉన్నట్లు హామస్ పేర్కొంది. గత శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 150మందిని బందీలుగా చేసుకుంది.
ఇజ్రాయెల్ దాడుల్లో 1500 మంది మృతి
బందీలను విడిపించేందుకు పోరాడుతున్న సమయంలో హమస్ బలగాలను ఇజ్రాయెల్ రక్షణ దళం మట్టుపెడుతోంది. ఈ క్రమంలో గజా అంతటా దాడులను చేస్తోంది. 2.4 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులతో దాడులను చేస్తూనే ఉంది. ఈ క్రమంలో భవనాలు నేలమట్టం కాగా, జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. ఇందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా స్పష్టం చేసింది. బందీలను హతమారుస్తామని హమాస్ ప్రకటించినా, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.