నేపాల్ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. విమానంలో ఉన్న 72మందిలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరినట్లు పేర్కొంది. విమాన ప్రమాదం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయట పడ్డారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన నేపాల్
విమాన ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సోమవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపించేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. మరో 5 నిమిషాల్లో గమ్యం చేరనున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురికావడం బాధాకరం. అయితే విమానం కూలే క్రమంలో రికార్డు అయినట్లుగా చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నియంత్రణ కోల్పోయి.. గాలిలో తిరుగుతూ.. అది భూమిని తాకడంతో భారీ శబ్ధం వచ్చినట్లు ఆ వీడియోలో వినబడుతుంది.