LOADING...
Venezuela Earthquake: వెనెజువెలాలో ప్రకృతి విలయం.. శిథిలాల దిబ్బగా మారిన హోటల్‌.. 164 మంది మృతి
164 మంది మృతి

Venezuela Earthquake: వెనెజువెలాలో ప్రకృతి విలయం.. శిథిలాల దిబ్బగా మారిన హోటల్‌.. 164 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం కూడా భారీగా నమోదైంది. ముఖ్యంగా తీర ప్రాంత నగరమైన లా గువైరా అత్యధికంగా ప్రభావితమై, ఎటు చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ పూర్తిగా నేలమట్టమైంది.

వివరాలు 

పేకమేడలా కూలిపోయిన 10 అంతస్తుల హోటల్

లా గువైరాలోని మకుటో ప్రాంతంలో ఉన్న హోటల్ ఎడ్వర్డ్‌ పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి. విమానాశ్రయానికి సమీపంలో, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ 10అంతస్తుల హోటల్‌ బీచ్ వ్యూతో ఆకట్టుకునేది. ఇక్కడ తరచూ పార్టీలు,సమావేశాలు నిర్వహించేవారు. అయితే ఇటీవల సంభవించిన భూకంపాల ప్రభావంతో ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం బేస్‌మెంట్‌ మినహా మిగతా నిర్మాణం అంతా శిథిలాలుగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో హోటల్‌లో ఎంతమంది ఉన్నారు,వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే వెనెజువెలాకు చెందిన ప్రముఖ బేస్‌బాల్‌ క్రీడాకారుల కుటుంబ సభ్యుల్లో కొందరు ఈ హోటల్‌ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

వివరాలు 

డిజాస్టర్‌ జోన్‌గా..

కొద్ది క్షణాల వ్యవధిలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల కారణంగా వెనెజువెలా రాజధాని కరాకస్ సహా పలు నగరాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం లా గువైరా అని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ తెలిపారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని అధికారికంగా డిజాస్టర్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో దాదాపు 30 సార్లు భూప్రకంపనలు నమోదైనట్లు ఆమె చెప్పారు.

Advertisement

వివరాలు 

164 మంది మృతి..

భూకంపాల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 164కు పెరిగిందని డెల్సీ రోడ్రిగ్జ్‌ వెల్లడించారు. మరో 971 మంది గాయపడినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, వెనెజువెలాకు అత్యవసర సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. జర్మనీ సైనిక రవాణా విమానాలను పంపేందుకు సిద్ధమైంది. అలాగే స్పెయిన్ కూడా అత్యవసర సహాయక చర్యలకు మద్దతు ప్రకటించింది.

Advertisement