LOADING...
Gaza- Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 17 మంది మృతి 
గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 17 మంది మృతి

Gaza- Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 17 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ గాజాపై దాడులను కొనసాగిస్తూ, హమాస్‌ అధినేత యాహ్య సిన్వర్‌ మరణంతో తాము మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం నుసీరత్‌ శిబిరం, సెంట్రల్‌ గాజాలో ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ (IDF) బాంబులు విసరడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 13 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలుస్తోంది, అలాగే 42 మంది గాయపడినట్లు సమాచారం. అయితే, IDF మాత్రం తమ దాడులు కేవలం హమాస్‌ మిలిటెంట్ల పైనే ఉద్దేశించినవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో,కాల్పుల విరమణ చర్చలు త్వరలో ప్రారంభం కావచ్చని, ఖతార్‌లో పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

వివరాలు 

అల్‌ జజీరా జర్నలిస్టులను టెర్రరిస్టులుగా ప్రకటించిన IDF

హమాస్‌ చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని కూడా చెప్పారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లకు 135 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలా ఉండగా, గాజా యుద్ధ వార్తలను వెలుగులోకి తెచ్చిన ఆరుగురు అల్‌ జజీరా జర్నలిస్టులను టెర్రరిస్టులుగా IDF ప్రకటించింది. తమకు లభించిన పత్రాలు, నిఘా వర్గాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఆరోపణల్లో ఇద్దరికి హమాస్‌తో, నలుగురికి పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఆరోపణలపై అల్‌ జజీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ వాస్తవాలను వెల్లడించే పాత్రికేయులను మూయించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తోందని తీవ్ర విమర్శలు చేసింది.