Page Loader
Israel:19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు 
19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు

Israel:19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు గాజాలోని సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ దాడులపై అక్కడి పార్లమెంటులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌ ఎంపీ ఐమన్‌ ఒదె (Ayman Odeh) పార్లమెంటులో గళమెత్తి, ప్రభుత్వ చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. గాజాలో జరుగుతున్న విధ్వంసానికి పాలకులే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఐమన్‌ ఒదె మాట్లాడుతూ, మీరు దాదాపు ఏడాదిన్నర కాలంలో 19,000 మంది చిన్నారులను చంపారు. మొత్తం 53,000 మందిని హత్య చేశారు. గాజాలో ఉన్న ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. అయినా మీరు మానసికంగా గెలిచామని నమ్మలేకపోతున్నారు. ఇది పిచ్చితనమేనని విమర్శించారు.

Details

దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు

ఆయన వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేశాయి. వెంటనే సభలోని అధికారులు ఐమన్‌ను పోడియం నుంచి బయటకు లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇక ఇటీవల గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడులపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఇజ్రాయెల్‌ మాజీ ఆర్మీ చీఫ్‌ యాయిర్‌ గొలాన్‌ సైతం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై మండిపడ్డారు. చిన్నారుల హత్యలు ఒక రకంగా 'హాబీ'గా మారాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో ఇప్పటివరకు 53,000 మందికిపైగా మరణించారని గాజాలోని స్థానిక అధికారులు వెల్లడించారు.

Details

ఈ పోరులో వెనక్కితగ్గే ప్రసక్తే లేదు

కేవలం గత 24 గంటల వ్యవధిలోనే 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం గాజాలో మానవతా సహాయం ఆందోళనకర స్థితిలో ఉంది. ఇజ్రాయెల్‌ పరిమిత సాయం మాత్రమే అనుమతిస్తోంది. అయితే ఇది ప్రజల అవసరాలను తీర్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో సరిపోదని అంతర్జాతీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తాను గాజాను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంటానని, పోరాటం కొనసాగుతుందని ప్రధాని నెతన్యాహు ఇటీవల ప్రకటించారు. మేము గాజాలో పురోగతి సాధిస్తున్నాం. ఈ పోరులో వెనక్కితగ్గే ప్రసక్తే లేదు. గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఐమన్‌ ఒదె వంటి నేతలు అధికార చర్యలపై విమర్శలు చేయడం గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని మరింత స్పష్టంగా బయటపెడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్