Loading...
American Airlines: ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. గాల్లో త్రుటిలో తప్పిన ప్రమాదం!
ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. గాల్లో త్రుటిలో తప్పిన ప్రమాదం!

American Airlines: ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. గాల్లో త్రుటిలో తప్పిన ప్రమాదం!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు ఒకే ఫ్లైట్‌ నంబర్‌ ఉండటంతో అవి ఒకే ప్రాంతంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గుర్తించిన ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోలర్‌ వెంటనే అప్రమత్తమై వేర్వేరు సూచనలు ఇవ్వడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాలు 

ఫీనిక్స్‌లో ఘటన..

ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌ ప్రాంతంలో ఉన్న స్కైహార్బర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ బోయింగ్‌ విమానం షికాగో నుంచి ఫీనిక్స్‌ వైపు వస్తుండగా.. మరో విమానం ఫీనిక్స్‌ నుంచి బయల్దేరింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షికాగో నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది.

దీంతో రెండు విమానాలు ఒకే సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది.

ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో..

ఈ రెండు విమానాలకు 'అమెరికన్‌ 2482'అనే ఒకే ఫ్లైట్‌ నంబర్‌ ఉండటం పరిస్థితిని మరింత అసాధారణంగా మార్చింది.

దీంతో అవి కొద్దిసేపు ఒకే ప్రాంతంలో ప్రయాణించాయి. విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తున్న ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోలర్‌ ఈ విషయాన్ని గుర్తించారు.

వివరాలు 

కంట్రోలర్‌ చాకచక్యంతో తప్పిన ప్రమాదం..

వెంటనే అరైవల్‌లో ఉన్న విమానానికి, బయల్దేరిన విమానానికి వేర్వేరు సూచనలు ఇచ్చారు.

అరైవల్‌లో ఉన్న విమానాన్ని మరింత ఎత్తుకు వెళ్లాలని, ఫీనిక్స్‌ నుంచి బయల్దేరిన విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించాలని కంట్రోలర్‌ సూచించారు.

పైలట్లు వెంటనే ఆదేశాలను పాటించి తమ విమానాల మార్గాలను మార్చుకున్నారు. దీంతో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది.

విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

25 ఏళ్ల అనుభవంలో ఇదే తొలిసారి..

ఈ ఘటనపై స్పందించిన ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోలర్‌.. తాను 25 ఏళ్లుగా ఈ విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.

ఇలాంటి అసాధారణ పరిస్థితిని తన ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు ఒకే ప్రాంతంలో ప్రయాణించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

భద్రతాపరమైన ఈ లోపంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT