Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా ఇరాన్ తన దాడులను పెంచింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడి చేసినట్టు సమాచారం. దాడి జరిగిన ప్రాంతంలో మంటలు చెలరేగగా, భారీగా పొగ వ్యాపించింది. సౌదీ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు డ్రోన్లతో యూఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. దాంతో భవనం పరిసరాల్లో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలిపింది. అయితే భవనానికి స్వల్ప నష్టం మాత్రమే వాటిల్లిందని స్పష్టం చేసింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉండటంతో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
కువైట్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి
ఈ ఘటనల నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్ నగరాల్లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో రియాద్‌లో మరికొన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. ఇక సోమవారం కువైట్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి జరిపిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా హెచ్చరికలు జారీ చేశారు. రియాద్‌లోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.