మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం
తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు. తుఫాను వల్ల ప్రభావితమైన పదివేల మంది మాలావియన్లకు సహాయం చేయడానికి ప్రభుత్వం 1.6 బిలియన్ క్వాచా ($1.5 మిలియన్లు) వాగ్దానం చేసింది, ఈ విపత్తులో దేశంలో కనీసం 225 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు.
మొజాంబిక్‌లో తుఫాను 63 మంది ప్రాణాలను బలిగొంది
మలావిలోని దక్షిణ ప్రాంతాలలో, ఎక్కువగా వాణిజ్య రాజధాని బ్లాంటైర్ సమీపంలో ప్రాణాలతో బయటపడిన వారిని చేరుకోవడానికి రక్షకులు చాలా కష్టపడ్డారు. తుఫాను బుధవారం బలహీనపడడం ప్రారంభించింది. కొన్ని ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన తరువాత, బాధితుల నష్టం, దుస్థితి చూస్తున్న చిత్రాలు, ఫుటేజీల కంటే చాలా ఘోరంగా ఉందని అన్నారు అధ్యక్షుడు చక్వేరా. చిలోబ్వేలోని బ్లాంటైర్ టౌన్‌షిప్‌లో కొంతమంది బాధితుల అంత్యక్రియలకు అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. మొజాంబిక్‌లో, తుఫాను 63 మంది ప్రాణాలను బలిగొంది. అధికారిక గణాంకాల ప్రకారం 49,000 మంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు ఫిలిప్ న్యుసి బుధవారం రాత్రి దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.