
ఎబోలాను పోలిన వైరస్: ఈక్వటోరియల్ గినియాలో 9మంది మృతి; డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలాను పోలిన మార్బర్గ్ వైరస్ సోకి తొమ్మిది మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రాణాతకమైన ఈ వైరస్ సోకడం వల్ల జ్వరంతోపాటు రక్తస్రావమై వారు మరణించినట్లు తెలిపింది.
మరణించిన తొమ్మిది మందిలో మార్బర్గ్ వైరస్ నమూనాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ వ్యాప్తి ఇదే మొదటిసారి అని చెప్పింది.
వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు, కాంటాక్ట్‌లను గుర్తించి ఐసోలేట్ చేయడానికి, వైద్య సాయం అందించడానికి ప్రత్యేక బృందాలను మోహరించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
మార్బర్గ్ వైరస్
మార్బర్గ్ వైరస్ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి
మార్బర్గ్ వైరస్ అత్యంత ప్రాణాంతకమైనదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 88శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ఎబోలాకు కారణమయ్యే వైరస్ కుటుంబానికి చెందినది మార్బర్గ్ అని వివరించింది.
లక్షణాలు: వైరస్ సోకిన వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పితో తీవ్రమైన అనారోగ్యంతో అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. చాలామంది రోగుల్లో ఏడు రోజుల్లో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు ఉంటాయి.
ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది.
ఇప్పటి వరకు మార్బర్గ్ వైరస్‌కు టీకాలు, చికిత్స లేదు.
అయితే నివారణ చర్యలతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.