Nepal floods: గుర్తుపట్టలేని స్థితిలో 229 మృతదేహాలు.. నేపాల్‌లోనే అంత్యక్రియలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆకస్మిక వరదలు సృష్టించిన విలయంతో నేపాల్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలో లభ్యమైన 229 గుర్తుతెలియని మృతదేహాలను అధికారులు అక్కడే ఖననం చేశారు. ఈ మృతదేహాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పాటు ఇతర వ్యాధులు ప్రజలకు వ్యాపించే అవకాశం ఉండటంతో వాటిని ఖననం చేయాలని నిర్ణయించినట్లు చిత్వాన్ జిల్లా భద్రతా కమిటీ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో మొత్తం 233 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగామని అధికారులు తెలిపారు.
వివరాలు
డీఎన్‌ఏ నమూనాలతో పరీక్షలు నిర్వహిస్తాం
మిగిలిన 229 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో పూర్తిగా కుళ్లిపోయాయని పేర్కొన్నారు.
ఖననం చేయడానికి ముందు ప్రతి మృతదేహం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
ఆయా మృతదేహాలకు కేటాయించిన గుర్తింపు సంఖ్యల ఆధారంగా రికార్డులను భద్రపరుస్తామని వెల్లడించారు.
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మృతదేహాల గుర్తింపునకు కుటుంబసభ్యుల డీఎన్‌ఏ నమూనాలతో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వివరాలు
మరోసారి వరద ముప్పు
నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు.
అనేక ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా భోటేకోషి, త్రిశూలి నదులకు మరోసారి వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆయా నదుల తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అక్కడికి దూరంగా ఉండాలని సూచించింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజలకు స్పష్టం చేసింది.
వరదల ముప్పు నేపథ్యంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్న సిబ్బందితో పాటు ప్రయాణికులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.