మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి
సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు. దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇది ఒకటి. సెంట్రల్ మొరాకోలోని డెమ్నేట్ అనే పట్టణంలో వీక్లీ మార్కెట్‌కు ప్రయాణికులను తీసుకెళ్తున్న మినీబస్సు మూలమలుపు వద్ద బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌కోసం రాయల్ జెండర్‌మెరీ, సివిల్ ప్రొటెక్షన్‌ను మోహరించారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొరాకోతో పాటు ఇతర ఉత్తర ఆఫ్రికా దేశాల రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. నేషనల్ రోడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, మొరాకోలో సంవత్సరానికి సగటున 3,500 రోడ్డు ప్రమాద మరణాలు, 12,000 గాయాలు నమోదవుతున్నాయి.