Donald Trump: ఒక్కో వ్యక్తికి 2వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడంలో దూకుడుతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలు వివాదాస్పదమవడంతో, వాటిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు కోర్టులలో దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు న్యాయస్థానాల నుండి కొన్ని ప్రతికూల సంకేతాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడం ట్రంప్‌ను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు పూర్తిగా అవివేకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అయితే సుంకాల వల్ల దేశానికి భారీ ఆదాయం వస్తోందని, ఆ ఆదాయంలో భాగంగా ప్రతి అమెరికన్‌కు కనీసం 2 వేల డాలర్ల డివిడెండ్ అందజేస్తామని పేర్కొన్నారు.
వివరాలు
ప్రతి వ్యక్తికి 2 వేల డాలర్ల డివిడెండ్
''సుంకాలను వ్యతిరేకించే వారు అసలు పరిస్థితిని అర్థం చేసుకోలేరు. అమెరికా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికమైన, ప్రతిష్టాత్మకమైన దేశంగా నిలుస్తోంది. ద్రవ్యోల్బణం చాలా తక్కువ. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. సుంకాల ద్వారా భారీగా నిధులు వసూలవుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని తీర్చడం మొదలు పెడతాం. అధిక ఆదాయం లేని ప్రతి అమెరికన్ పౌరుడికి కనీసం 2 వేల డాలర్ల డివిడెండ్ ఇవ్వబోతున్నాం'' అని ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
'సుప్రీం కోర్టు అసలు ఏం చెబుతోంది?' - ట్రంప్ ఆగ్రహం
''అమెరికా అధ్యక్షుడికి ఏ దేశంతో వాణిజ్యాన్ని ఆపివేయడం,అనుమతి ఇవ్వడం,పరిమితులు విధించడం వంటి అధికారాలు స్పష్టంగా ఉన్నాయి.అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశీ దేశాలపై సాధారణ సుంకాలు విధించడంలో తప్పేముంది?ఇతర దేశాలు మనపై సుంకాలు వేస్తుంటే మనం ఎందుకు వేయకూడదు?సుంకాల కారణంగా అమెరికాలోకి వ్యాపారాలు పెద్ద ఎత్తున తిరిగి వచ్చాయి. ఇది సుప్రీం కోర్టుకు తెలియదా? అసలేం జరుగుతోంది?'అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన దిగుమతి సుంకాల మార్పులు,కొత్త సుంకాల విధానంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల చట్టం పేరిట అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇవ్వడం సరైనదేనా అనే ప్రశ్నల్ని కోర్టు లేవనెత్తింది. ఈ పరిణామాలన్నింటిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.