
Mali: మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా..రంగంలోకి దిగిన భారత ఎంబసీ..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు జరిపిన దాడికి అనుబంధంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న ఉగ్రవాదులు బాధ్యులైనట్టు భారత విదేశాంగశాఖ గురువారం స్పష్టం చేసింది. ఈ దాడి మాలీలోని కాయెస్ ప్రాంతంలో ఉన్న డైమెండ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ నెల 1వ తేదీన జరిగింది. అప్పటినుంచి అక్కడ పనిచేస్తున్న కార్మికులను దుండగులు బంధించారు. బందీలుగా తీసుకుపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ (JNIM) అనే అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.
వివరాలు
ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం
అయితే కిడ్నాప్ అయిన భారతీయుల వివరాలను విదేశాంగశాఖ మాత్రం వెల్లడించలేదు. మాలి రాజధాని బమాకోలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై అక్కడి అధికారులు, సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగశాఖ తెలిపింది. అలాగే కిడ్నాప్‌కు గురైన వారికీ చెందిన కుటుంబాలతో కూడా సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బందీలను అత్యవసరంగా, సురక్షితంగా విడుదల చేయాలంటూ మాలీ ప్రభుత్వాన్ని కోరింది. మాలీలో నివసిస్తున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే బమాకోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. చివరగా, కిడ్నాప్‌కు గురైన భారతీయులను వీలైనంత త్వరగా రక్షించి స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.