Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు
ఇజ్రాయెల్ దళాలు తమ దాడిని ఉత్తర గాజాలో మరింత విస్తరించాయి. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాహ్ నగరంలోని అల్-అక్సా ఆసుపత్రి సమీపంలోని పాలస్తీనియన్ల గుడారాలపై బాంబులతో జరిపింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక వైద్యుల ప్రకారం, మిలియన్ల మంది ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. గుడారాలు దగ్ధమవుతుండటంతో, కొంతమంది పాలస్తీనియన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఉన్నారని, పౌర సౌకర్యాలు, ఆసుపత్రులు వంటి ప్రాంతాలను హమాస్ సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించింది.
ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ దాడులలో 22 మంది మృతి
ఆసుపత్రులు రోగులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ అవసరమైన వైద్య సామగ్రి కొరతకు గురవుతోంది. హమాస్ నేతలు ఆసుపత్రుల్లో తలదాచుకున్నారని నెతన్యాహు సేన దాడులు కొనసాగిస్తోంది. ఇక నివాసితులు ఉత్తర గాజాలోని బీట్ హనౌన్, జబాలియా, బీట్ లాహియా పట్టణాలకు వెళ్లేందుకు అనుమతి లేకుండా, ఇజ్రాయెల్ రెండు ప్రాంతాల మధ్య ప్రవేశాన్ని నిరోధించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తొమ్మిది రోజుల పాటు ఉత్తర గాజాలో పెద్ద ఆపరేషన్ నిర్వహించగా, దాదాపు 300 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు. అలాగే, సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంపులో ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ జరిపిన దాడిలో 22 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు.