Jaahnavi Kandula Case: అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో పోలీసు అధికారి చేసిన తీవ్ర నిర్లక్ష్యం కారణంగా తెలుగు యువతి జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగరం అంగీకరించింది. ఈ విషయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అధికారికంగా వెల్లడించారు. జాహ్నవి కందుల మరణం అత్యంత హృదయవిదారకమని పేర్కొన్న సియాటెల్ అటార్నీ,ఈ పరిహార ఒప్పందం వల్ల అయినా ఆమె కుటుంబానికి కొంతమేర మనోధైర్యం కలుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే ఈ పరిణామంపై జాహ్నవి కుటుంబం తరఫున న్యాయవాది నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వెలువడలేదు.
వివరాలు
కేసు వివరాలివి..
ఈ కేసుకు సంబంధించిన పరిహార ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇరు పక్షాలు గత వారం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత విద్యాభ్యాసం కోసం 2021లో అమెరికా వెళ్లారు.
సియాటెల్‌లోని సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు.
ఈ క్రమంలో 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే. జాహ్నవి మరణాన్ని తేలికగా తీసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
వివరాలు
కేసు వివరాలివి..
'ఆమె ఒక సాధారణ వ్యక్తి... ఈ మరణానికి విలువ లేదు' అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై అప్పట్లో భారత్ తీవ్రంగా స్పందించింది.అమెరికాలోనూ కెవిన్ ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు.
అంతేకాదు, ప్రమాదం జరిగిన ప్రాంతం గంటకు 40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న జోన్‌గా గుర్తించారు.
అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ కెవిన్ గంటకు సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో తేలింది.
ఢీకొన్న దెబ్బకు జాహ్నవి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు అప్పట్లో వార్తలు వెల్లడించాయి.
ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.