ఇజ్రాయెల్ థాటికి నెత్తురోడుతున్న గాజా.. 24 గంటల్లోనే 266 మంది పాలస్తీనియన్ల మృత్యువాత
హమాస్ పై భీకర దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, గాజాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మేరకు చేసిన ప్రతీకార దాడులతో బాంబుల మోత మోగించింది. గాజాలోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో 30 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా వెల్లడించింది. జబలియా శరణార్థ శిబిరం ఉన్న అల్ సుహాదా ప్రాంతంలో ఉన్న ఈ భవనం ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలిపోయింది. ఈ మేరకు పక్కనున్న భవనాలూ ధ్వంసమైనట్లు వివరించింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొత్తంగా గాజా నగరంలో 266 మంది మరణించారు. వీరిలో 117 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇజ్రాయెల్ థాటికి 266 మంది మృతి
గత రెండు వారాలుగా గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 4,600 మంది మరణించారు.ఇటు హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వందలాది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లోగాజాలోని 30 మంది పాలస్తీనియన్లు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో 266 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు సోమవారం గాజాపై బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ అమెరికా, యూకె, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలు అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని సూచిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.