320ఏళ్ల వార్తాపత్రిక మూసివేత: ప్రభుత్వ పాలసీలే కారణం
వియన్నా కేంద్రంగా నడుస్తున్న 'వీనర్ జీతంగ్' అనే పురాతన దిన పత్రిక, దాని ప్రచురణను ఆపేసింది. 320ఏళ్లుగా 'వీనర్ జీతంగ్' న్యూస్ పేపర్ అక్కడి ప్రజల జీవితాలతో బంధాన్ని పెనవేసుకొనిపోయింది. తాజాగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రచురణను నిలిపివేసింది. 1703సంవత్సరంలో మొదలైన 'వీనర్ జీతంగ్' ప్రత్రిక, ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలను చవి చూసింది. పేపర్ ఆదాయం విపరీతంగా తగ్గడంతో వార్తా పత్రికను మూసివేయాల్సి వచ్చింది. చట్టపరమైన ప్రకటనలు ప్రచురించడానికి ఫీజును తగ్గించాలని ఆస్ట్రియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 'వీనర్ జీతంగ్' ప్రత్రిక నష్టాలు చవి చూసింది.
జర్నలిజానికి తుఫాను సమయం
ఆస్ట్రియా ప్రభుత్వం నిర్ణయం కారణంగా 'వీనర్ జీతంగ్' ప్రత్రిక, ఏకంగా 18మిలియన్ల యూరోలను నష్టపోయినట్లు డెర్ సీగల్ రాసుకొచ్చింది. అంతేకాదు సంపాదకులుగా పనిచేసి వారి సంఖ్య 35కు పడిపోయింది. మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 63కు తగ్గింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని పత్రిక ఎడిటర్ హోమాస్ సీఫెర్ట్ వ్యతిరేకించారు. ఇది జర్నలిజానికి గొడ్డలి పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. వీనర్ జీతంగ్ చివరి దినసంచిక జూన్ 30 శుక్రవారం నాడు పబ్లిష్ అయ్యింది. అయితే దినపత్రిక మూతబడినా ఆన్ లైన్ సంచిక అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.