
Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు ప్రాధాన్యత లభించింది.
అనితా ఆనంద్(58) విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా,మణీందర్ సిద్ధూ (41) అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదే సమయంలో,రణ్‌దీప్ సరాయ్ (50) అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా,రూబీ సహోటా (44) నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనితా ఆనంద్ భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం.ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ,"ఈ బాధ్యత నాకు గర్వకారణం.కెనడియన్లకు సురక్షితమైన,న్యాయ సమాజాన్ని అందించేందుకు ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని బృందంతో కలిసి పనిచేయనున్నాను"అని తెలిపారు.
వివరాలు
మంత్రుల సంఖ్యను 39 మందినుంచి 28 మందికి..
అనితా లిబరల్ పార్టీకి చెందిన సీనియర్ నేత. గతంలో ప్రజా సేవలు,ఇన్నోవేషన్, శాస్త్ర సాంకేతిక శాఖ, పరిశ్రమలు, రక్షణ వంటి శాఖల మంత్రిగా సేవలందించారు.
ఇక మణీందర్ సిద్ధూ మంత్రిగా నియమితులవడం తన జీవితంలో ఒక గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ఆమెకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు.
మంత్రుల సంఖ్యను 39 మందినుంచి 28 మందికి తగ్గించారు.ఇందులో సగం మంది మహిళలే ఉండటం ఒక విశేషం.
కెనడా-అమెరికా మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో,ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్టు కార్నీ స్పష్టం చేశారు.
వివరాలు
కెనడాలో పుట్టి పెరిగిన అనితా ఆనంద్
1967 మే 20న అనితా ఆనంద్ కెనడాలోని కెంట్‌విల్లేలో జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్ తమిళనాడుకు చెందినవారు కాగా, తల్లి సరోజ్ డి రామ్ పంజాబీ మూలాలవారు.
ఈ దంపతులు 1960లలో భారత్ నుండి కెనడాకు వలస వెళ్లారు. అనితా 1985లో ఒంటారియోలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ సాధించగా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ, డల్హౌసీ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, టొరంటో విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
న్యాయవాదిగా, శిక్షణా రంగంలో, అలాగే ప్రజా సేవ రంగంలో ఆమె బలమైన స్థానం ఏర్పరచుకున్నారు.
వివరాలు
ప్రధాని పదవికి అనిత పేరు
1995లో అనితా, న్యాయవాది,వ్యాపారవేత్త అయిన జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు.
వీరికి నలుగురు సంతానం. 2019లో అనిత కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టి, రక్షణ మంత్రిగా చారిత్రక ఘనత సాధించారు.
ఆమె క్రమశిక్షణ, పారదర్శకతకు మంచి ప్రశంసలు లభించాయి. 2023లో జస్టిన్ ట్రూడో పదవి నుంచి తప్పుకున్న సమయంలో, ప్రధాని పదవికి అనిత పేరు బలంగా వినిపించింది.
వివరాలు
ఇతర భారతీయ మూలాల నేతల వివరాలు
మణీందర్ సిద్ధూ పంజాబీ మూలాల వ్యక్తి. తల్లిదండ్రులతో చిన్ననాటే కెనడాకు వలస వెళ్లారు.
ప్రస్తుతం బ్రాంప్టన్ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎంపీగా సేవలందిస్తున్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు.
రూబీ సహోటా కూడా పంజాబీ మూలాలు కలిగినవారు. ఆమె టొరంటోలో జన్మించారు.
రణ్‌దీప్ సరాయ్ తల్లిదండ్రులు కెనడాకు వలస వెళ్లగా, ఆయన బ్రిటిష్ కొలంబియాలో జన్మించారు.
ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో మొత్తం 22 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీగా గెలవడం విశేషం.
ఇది కెనడా రాజకీయాలలో భారతీయ మూలాల ప్రాబల్యాన్ని సూచించే సంఘటనగా చర్చనీయాంశమవుతోంది.