
Arizona: ఉత్తర అరిజోనాలోని కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వైద్య రవాణా విమానం భయంకరంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించారు. విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మధ్యాహ్నం సుమారు 12:40 ప్రాంతంలో, చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. ప్రమాద సమయంలో ఆ విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక రోగిని తరలిస్తూ ప్రయాణిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు విమానం ఆకస్మికంగా కూలిపోయింది. ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియకపోయినా, విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
వివరాలు
NTSB, FAA అధికారుల విచారణ
ఈ విమానం న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి బయలుదేరినదిగా గుర్తించారు. ఇది CSI ఏవియేషన్ కంపెనీకి చెందినదని తెలిసింది.విమానం అరిజోనాలోని చిన్లే వద్ద ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఉండగా ఫీనిక్స్‌కు ఈశాన్యంగా సుమారు 300 మైళ్లు (అంటే 483 కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం,విమానం చిన్లే విమానాశ్రయంలో దిగే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరిగింది. విమానం కూలడానికి సాంకేతిక లోపం గానీ, ఇతర కారణాల గానీ బాధ్యతవైపుకా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని నవాజో జిల్లా పోలీసు కమాండర్ ఎమ్మెట్ యాజ్జీ వెల్లడించారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB)తో పాటు FAA అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
వివరాలు
జనవరిలో ఫిలడెల్ఫియాలో కూడా కూలిన వైద్య రవాణా విమానం
ఈ విషాద ఘటనపై నవాజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ, నలుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మరల జరగకూడదని, బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక ఈ ఘటనకు ముందు, ఈ ఏడాది జనవరిలో ఫిలడెల్ఫియాలో కూడా ఓ వైద్య రవాణా విమానం కూలిపోయిన ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనపై దర్యాప్తు చేసిన జాతీయ రవాణా భద్రతా బోర్డు ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయలేదని వెల్లడించింది.