Canada: కనిష్క విమానాన్ని కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే.. 41 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారికంగా అంగీకరించిన కెనడా
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఘటనపై నాలుగు దశాబ్దాల తర్వాత కెనడా కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్రను అధికారికంగా ప్రస్తావించకుండా వచ్చిన ఆ దేశం.. 41 ఏళ్ల అనంతరం తొలిసారి ఆ దాడికి ఖలిస్థానీ వేర్పాటువాదులే కారణమని స్పష్టం చేసింది. దీంతో ఈ అంశం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 1985 జూన్ 23న అట్లాంటిక్ మహాసముద్రంపై ఎయిరిండియాకు చెందిన బోయింగ్-747 'కనిష్క' విమానం పేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 329 మంది ప్రాణాలు కోల్పోయారు. టొరంటో నుంచి ముంబయికి బయల్దేరిన ఈ విమానంలో ఉగ్రవాదులు ముందుగానే బాంబు అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వివరాలు
కెనడాను కేంద్రంగా చేసుకుని ఖలిస్థానీ తీవ్రవాదులు కార్యకలాపాలు
ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఘటన వెనుక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉందని భారత్ స్పష్టంగా పేర్కొంది. అయితే కెనడా మాత్రం ఇన్నేళ్ల పాటు ఖలిస్థానీ వేర్పాటువాదుల పేరును అధికారికంగా ప్రస్తావించకుండా వచ్చింది. విచారణ కూడా ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రధాన నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్) తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో కనిష్క విమాన పేలుడు ఘటనకు ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమమే కారణమని అధికారికంగా వెల్లడించింది. కెనడాను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్థానీ తీవ్రవాదులే విమానంలో బాంబు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొంది.
వివరాలు
కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమై ఉగ్రదాడి
అంతేకాకుండా, కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఇదొకటిగా ఈ ఘటనను సీఎస్‌ఐఎస్ అభివర్ణించింది. విమానంలోని లగేజీ విభాగంలో ఖలిస్థానీ ఉగ్రసంస్థ బబ్బర్ ఖాల్సా సభ్యులు బాంబులు అమర్చి పేల్చడంతో కనిష్క విమానం కుప్పకూలిందని స్పష్టం చేసింది.