Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి
నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది. ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదం ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ ఒక ట్రక్కును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించి, ఆ ప్రాంతంలో కనీసం 50 పశువులు సజీవ దహనం అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మొత్తం 50 పశువులు సజీవ దహనం కావడాన్ని బాబా-అరబ్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రమాదంతో ప్రజలలో ఆందోళన
మొదట 30 మృతదేహాలు బయటకు తీశామని, ఆ తరువాత మరో 18 మృతదేహాలు బయటపడినట్లు పేర్కొన్నారు. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ప్రజలలో ఆందోళన పెరగడంతో నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో, ప్రజలను ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటం ఆందోళనకరం. రవాణా కోసం సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో, ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2020లో నైజీరియాలో 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు నమోదయ్యాయి, వీటిలో 535 మంది మరణించగా, 1142 మంది గాయపడ్డారు.