LOADING...
Jaish Women Wing: 5,000 మంది సభ్యులు,ఆన్‌లైన్ శిక్షణ,రూ.500 ఫీజు:  విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్‌ 
విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్

Jaish Women Wing: 5,000 మంది సభ్యులు,ఆన్‌లైన్ శిక్షణ,రూ.500 ఫీజు:  విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో జైషే మౌలిక విభాగాల్లో జరుగుతున్న మహిళల భాగస్వామ్య కుట్రలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుడు పథకంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ షాహిన్ షాహిద్‌ జైషే మహమ్మద్‌కు చెందిన మహిళా విభాగం 'జమాత్ ఉల్ మొమినాత్' సభ్యురాలిగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇదివరకే బయటపడ్డ ఈ విషయానికి తోడు, తాజాగా జైషే మహిళా బ్రిగేడ్‌కు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ విభాగంలో 5,000 మందికిపైగా మహిళలు చేరినట్లు సమాచారం. ఈ అంశాన్ని జైషే అధినేత మసూద్ అజార్ తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా వెల్లడించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

40 నిమిషాల పాటు ఆన్‌లైన్ శిక్షణ

అక్టోబర్ 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో మహిళల నియామక ప్రక్రియ ప్రారంభమైందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ నియామకాలు పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, కొట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల నుంచి జరిగినట్లుగా వెల్లడైంది. ఎంపికైన మహిళలకు ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు ఆన్‌లైన్ శిక్షణ అందజేస్తున్నట్లు సమాచారం. ఐసిస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలోనే మహిళలను కూడా ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉండే విధంగా ప్రేరేపిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. శిక్షణతో పాటు 'విరాళాల' పేరుతో ఒక్కో మహిళ నుంచి రూ.500 చొప్పున డబ్బు సేకరిస్తున్నట్లు తెలిసింది.

వివరాలు 

 అత్యంత కఠినంగా బ్రిగేడ్‌లో చేరిన మహిళలు పాటించాల్సిన నియమాలు

పురుష ఉగ్రవాదులకు ఇచ్చే విధంగానే మహిళా సభ్యులకు కూడా తీవ్రమైన శారీరక-మానసిక శిక్షణ ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిగేడ్‌లో చేరిన మహిళలు పాటించాల్సిన నియమాలు అత్యంత కఠినంగా ఉన్నాయని సమాచారం. భర్త లేదా కుటుంబ సభ్యులు తప్ప ఇతర పురుషులతో మాట్లాడరాదనే కట్టుబాటును విధించినట్లు వెల్లడైంది. ఈ మహిళా విభాగానికి మసూద్ అజార్‌ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తున్నట్టు వెల్లడైంది. ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు అఫీరా బీబీ ప్రధాన నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె 2019లో పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారిగా ఉన్న ఉమర్ ఫరూఖ్ భార్య కాగా, ఉమర్ అదే ఏడాది మార్చిలో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Advertisement

వివరాలు 

బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై క్షిపణి దాడులు

ఇదివరకూ 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత్ బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై క్షిపణి దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ బావగా, సాదియా భర్తగా ఉన్న యూసఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఆ ఊహించని నష్టాల నుంచి తేరుకునే క్రమంలోనే అజార్ ముఠా మరోసారి కొత్త కుట్రలకు తెరలేపింది. అందులో భాగంగానే మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసి, ఉగ్ర కార్యకలాపాలకు కొత్త మానవ వనరులను సిద్ధం చేస్తోంది.

Advertisement