Page Loader
Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం దేశంలోని ఉత్తర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది. ఈ విపత్తు వల్ల ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు, కానీ భారీ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ భూకంపం ప్రభావం భారత్‌లోనూ కనిపించింది, అక్కడి ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో నమోదైన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయింది. ఈ భూకంపం మధ్యాహ్నం 12:58 నిమిషాలకు సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపాయి. 31.25 అక్షాంశం, 70.52 రేఖాంశం వద్ద ప్రకంపనలు నమోదైనట్లు వివరించాయి.

వివరాలు 

ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు 

ఈ భూకంపం పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోర్ లాల్ ఈసాన్ ప్రాంతాన్ని కేంద్రంగా కలిగింది. భూమి ఉపరితలానికి 10కిలోమీటర్ల లోతులో ఫలక కదలికల కారణంగా ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెస్మాలజీ సెంటర్ వివరించింది. ఇప్పటివరకు ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేకపోయినా,ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. కరోర్ లాల్,లెయ్యా,డేరా ఇస్మాయిల్ ఖాన్, ఫతేపూర్, ఖాజియాబాద్, బస్తీ సర్ఘాని వంటి ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నట్లు సమాచారం. భూకంపం సమయంలో స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలు, షాపులను ఖాళీ చేసి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం తరువాత కూడా స్వల్ప ప్రకంపనలు కొనసాగడంతో ప్రజలు తిరిగి లోనికి వెళ్లడానికి భయపడ్డారు.

వివరాలు 

భూకంపం ప్రభావం భారత్‌లో..

ఈ భూకంపం ప్రభావం భారత్‌లో కూడా కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నొయిడా, హర్యానాలోని గుర్గావ్, పంజాబ్, రాజస్థాన్‌లలో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు.