Japan: జపాన్ తీరంలో 5.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటన కారణంగా ఇజు, ఒగాసవారా దీవులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో ఏర్పడింది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టంపై సంబంధిత అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు.
జపాన్ లో వరుస భూకంపాలు
భూకంపం వచ్చిన 40 నిమిషాల్లో ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో సుమారు 50 సెంటీమీటర్ల ఎత్తులో చిన్న సునామీ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కానీ సముద్రపు నీరు ఒక మీటర్ ఎత్తుకు చేరితే, సునామీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్న అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ చాలా సంవత్సరాలుగా భూకంపాల ప్రభావం ఎదుర్కొంటోంది, గత రెండు నెలల కాలంలో అనేక చిన్న భూకంపాలు కూడా చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 23న తైవాన్‌లో 4.8, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.