LOADING...
Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం పపువా న్యూ గినియాలో(Papua New Guinea)శనివారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే(USGS) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో భయానక పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ప్రకృతి విపత్తుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్న దానికి ఉదాహరణగా గత వారం మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాల్లో సంభవించిన భూకంపాలను చెప్పుకోవచ్చు. గత నెల 28న మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు 7.7, 6.3 తీవ్రతతో సంభవించాయి.

Details

ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

అతి తక్కువ వ్యవధిలో థాయ్‌లాండ్‌ను కూడా 6.4 తీవ్రతతో భూకంపం కుదిపింది. ఈ విధ్వంసకర ఘటనల్లో మయన్మార్‌ దేశంలో 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 4 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. వందలాది మంది గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పపువా న్యూ గినియాలోని ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉండగా, అధికారులు సునామీ అవకాశాలను పరిగణలోకి తీసుకొని అలర్ట్‌ స్థాయిని పెంచారు. తీర ప్రాంతాలవాసులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతం భూకంపాలకు ఎక్కువగా లోనయ్యే పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్'లో భాగమవడంతో ఇటువంటి ప్రకృతి విపత్తులు తరచూ చోటు చేసుకుంటుంటాయి.