USA: అమెరికా అయోవాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అయోవా రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితుడు కూడా ఉన్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. మస్కటీన్‌లోని 210 పార్క్ అవెన్యూలో ఉన్న ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలంలో తుపాకీ గాయాలతో తీవ్రంగా గాయపడిన నలుగురిని గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మస్కటీన్‌కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్‌ను ప్రధాన అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు.
వివరాలు
కుటుంబంలోని వివాదం వల్ల ఈ కాల్పులు
అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అతడు పరారైనట్లు వెల్లడించారు. అనంతరం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా,మరో ప్రాంతంలో అతడు తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా,మస్కటీన్‌లోని మరో నివాస ప్రాంతంతో పాటు గ్రాండ్‌వ్యూ అవెన్యూలో ఉన్న ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ప్రాథమిక విచారణలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదాలే ఈ వరుస కాల్పులకు కారణమైనట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.