LOADING...
Strait Of Hormuz: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. నిలిచిపోయిన 700 ట్యాంకర్లు
హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. నిలిచిపోయిన 700 ట్యాంకర్లు

Strait Of Hormuz: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. నిలిచిపోయిన 700 ట్యాంకర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చమురు రవాణాకు ప్రాణాధారంగా భావించే హోర్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మార్గాన్ని మూసివేశామని, నౌకలు వస్తే తగులబెడతామని ఇరాన్‌ హెచ్చరించడం గ్లోబల్‌ మార్కెట్లలో ఆందోళన రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో Strait of Hormuz మార్గంలో 700కిపైగా ట్యాంకర్లు నిలిచిపోయాయి. వీటిలో ఎక్కువ భాగం చమురు రవాణా నౌకలే. ఫలితంగా ఇంధన సరఫరాలో గణనీయమైన అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.

వివరాలు 

మార్చి 1న జలసంధిని దాటిన మూడు ట్యాంకర్లు

మారిటైమ్‌ విశ్లేషణ సంస్థలు Windward, Kpler విడుదల చేసిన డేటా ప్రకారం హోర్ముజ్‌ జలసంధిని అధికారికంగా మూసివేశామని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, Iran హెచ్చరికల ప్రభావంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. మార్చి 1న కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే మొత్తం 2.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురుతో ఈ జలసంధిని దాటాయి. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ మార్గంలో రోజుకు సగటున 19.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితిని పోల్చితే చమురు సరఫరా దాదాపు 86 శాతం తగ్గినట్టే.

వివరాలు 

జలసంధి ఇరువైపులా 706 విదేశీ ట్యాంకర్లు

మార్చి 2 ఉదయం ఒక చిన్న ట్యాంకర్‌, ఒక కార్గో నౌక మాత్రమే హోర్ముజ్‌ మార్గం గుండా ప్రయాణించాయి. ప్రస్తుతం జలసంధి ఇరువైపులా 706 విదేశీ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు విండ్‌వర్డ్‌, కెప్లెర్‌ వివరాలు చెబుతున్నాయి. వీటిలో 334 చమురు ట్యాంకర్లే కావడం గమనించదగ్గ విషయం. మిగతావి ఇతర సరుకు నౌకలు. అలాగే Gulf of Oman ప్రాంతంలోనూ కొన్ని నౌకలు నిలిచిపోయాయి.

Advertisement

వివరాలు 

రవాణా ఆగితే తీవ్ర పరిణామాలు

హోర్ముజ్‌ మార్గంలో మరికొన్ని రోజులు రవాణా నిలిచిపోతే ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యాంకర్ల రద్దీ పెరగడం, సరుకు డెలివరీలు ఆలస్యం కావడం వంటివి చమురు కొరతకు దారితీయొచ్చు. ఇప్పటికే గల్ఫ్‌ జలాల్లోకి వెళ్లే నౌకలకు బీమా నిబంధనలను అనేక కంపెనీలు కఠినతరం చేశాయి. హోర్ముజ్‌ మార్గంలో ప్రయాణించే నౌకల ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి చమురు ధరలపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది.

Advertisement

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎంత?

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆసియా, యూరప్‌లోని కొన్ని రిఫైనరీలు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషిస్తున్నాయి. అమెరికాలోని గల్ఫ్‌ కోస్ట్‌, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్‌, రష్యా దేశాల నుంచి చమురు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నాయి. అయితే భారత్‌, చైనా దేశాలు మాత్రం ముడి చమురు దిగుమతుల కోసం హోర్ముజ్‌ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎంత?

మన దేశంలో వినియోగించే ఎల్‌పీజీలో 80-85 శాతం దిగుమతుల ద్వారానే లభిస్తోంది. అందులో అధిక భాగం గల్ఫ్‌ దేశాల నుంచే హోర్ముజ్‌ జలసంధి మార్గంలో వస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ఎల్‌పీజీ నిల్వలు సుమారు రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా,ఈ మార్గం ద్వారా రోజుకు సగటున 2.5 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు భారత్‌కు దిగుమతి అవుతోంది. ఇది మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 50 శాతం. ఈ సరఫరా పూర్తిగా నిలిచిపోయినా, దేశంలో ఉన్న వ్యూహాత్మక నిల్వలు సుమారు 60 రోజుల వరకు అవసరాలను తీర్చగలవు. అందువల్ల తక్షణ ప్రభావం పెద్దగా లేకపోయినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని నిపుణుల అభిప్రాయం.

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎంత?

ఈ మార్గం నిరవధికంగా మూసివేస్తే భారత్‌ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశీయ అవసరాలను కాపాడేందుకు పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పరిమితులు విధించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri) స్పష్టం చేశారు.

వివరాలు 

భగ్గుమంటున్న చమురు ధరలు

తాజా పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర వరుసగా మూడో రోజు పెరిగి దాదాపు 80 డాలర్లకు చేరుకుంది. యూరోపియన్‌ గ్యాస్‌ ధరలు 40 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. సౌదీ అరేబియాలోని ప్రముఖ రిఫైనరీలలో ఒకటైన రాస్ తనురా శుద్ధి కర్మాగారం పై ఇరాన్‌ దాడి జరగడంతో దాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సాధారణంగా ఈ కేంద్రంలో రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ మార్కెట్లో సౌదీ చమురు వాటాలో ఇది దాదాపు 16 శాతం. ఈ పరిణామం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

Advertisement