LOADING...
Afghanistan: అఫ్గనిస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 71 మంది మృతి
అఫ్గనిస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 71 మంది మృతి

Afghanistan: అఫ్గనిస్థాన్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 71 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్‌ నుంచి బహిష్కరణకు గురై తిరిగి స్వదేశానికి వస్తున్న వలసదారులను తీసుకెళ్తున్న బస్సు దుర్ఘటనకు గురైంది. ఈ బస్సుకు మంటలు అంటుకోవడంతో జరిగిన విషాదంలో 71 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో జరిగింది. ఇరాన్‌ నుంచి తిరిగి వస్తున్న అఫ్గాన్‌ వలసదారులు ప్రయాణిస్తున్న బస్సు ఒక మోటార్‌సైకిల్‌తో ఢీకొనడం వల్ల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు సహాయ చర్యలకు దిగినా, మంటలను అదుపు చేయడంలో విఫలమయ్యారు. దాంతో 17 మంది చిన్నారులు సహా మొత్తం 71 మంది దుర్మరణం పాలయ్యారు.

వివరాలు 

1.5 మిలియన్లకు పైగా అఫ్గాన్‌ వలసదారులు 

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా మంటల్లో కాలిపోయి మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనిపై ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఇక అఫ్గాన్‌ శరణార్థుల విషయంలో ఇరాన్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలు గట్టిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున డిపోర్టేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్లకు పైగా అఫ్గాన్‌ వలసదారులను ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించారని అధికార వర్గాలు వెల్లడించాయి.