Page Loader
USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు
అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు

USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హింస, బెదిరింపుల కేసుల్లో భారతీయ మూలాలున్న 8 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల సంబంధాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది. అరెస్టు చేసిన వారిలో పంజాబ్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధాలు ఉన్న పవిత్తర్ సింగ్ బటాలా కూడా ఉన్నాడు. అతడు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. మిగిలిన ఏడుగురిని దిల్‌ప్రీత్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, విశాల్, గుర్తజ్ సింగ్, మన్ ప్రీత్ రాంధావా, సరబ్‌జిత్ సింగ్‌గా గుర్తించారు. వీరందరికీ ఉగ్రవాద సంస్థలతో అనుబంధం ఉండొచ్చని భారత నిఘా సంస్థలు భావిస్తున్నాయి.

Details

కాలిఫోర్నియాలో హింస

కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు బెదిరింపులకు, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, అక్కడి భద్రతా సంస్థలు ప్రత్యేక ఆపరేషన్‌కు దిగాయి. దాడుల సమయంలో నిందితుల నివాసాల్లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు సీజ్ చేశారు. అంతేకాదు, అరెస్టయిన వారంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిపై భారత్‌లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో అమెరికా అధికారులు భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో సంప్రదింపులు ప్రారంభించినట్టు వెల్లడించారు.

Details

పాక్ ప్రోత్సాహంతో భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలు? 

ఉగ్రవాద, వేర్పాటువాద లక్ష్యాలను సాధించేందుకు విదేశాల్లో తలదాచుకునే పంజాబ్ మూలాలున్న గ్యాంగ్‌స్టర్లు పాకిస్తాన్ వంటి దేశాల మద్దతుతో పని చేస్తూ ఉండే అవకాశం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ అరెస్టులతో పాటు అమెరికా అధికారులు, భారత ప్రభుత్వం కలిసి తదుపరి చర్యలు తీసుకోనున్నాయని సమాచారం. ఈ దృష్ట్యా బటాలా సహా మిగిలిన 7 మందిపై ఎన్‌ఐఏ ఇప్పటికే ఆధారాలు అందజేసినట్లు తెలుస్తోంది.