Page Loader
సాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం
నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం

సాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 24, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.సాంకేతిక లోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. పోర్ట్‌ సూడాన్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం టేకాఫ్‌ అవుతున్న క్రమంలో ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా కూలిపోయింది. ఘటనలో 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో నలుగురు సైనికులు ఉన్నట్లు సుడాన్ సైన్యం వెల్లడించింది. ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో నిలిచినట్లు వివరించింది. సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లో ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సూడాన్ లో జులై 8న జరిగిన వైమానిక దాడిలో 22 మంది చనిపోయారు. జూన్​లో మరో దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 17 మంది మరణించారు.

DETAILS

ఏప్రిల్ 15 నుంచి కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం 

అయితే ఆదివారం నాటికి ఇరు దళాల మధ్య సదరు ఘర్షణ వాతావరణం తలెత్తి వంద రోజులు పూర్తి కావొస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో సూడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జులై 23న డార్ఫర్ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. రాష్ట్ర రాజధాని న్యాలాలో జరిగిన కాల్పుల్లో దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్టూమ్‌కు తూర్పు వైపు 890 కిలోమీటర్ల దూరంలో పోర్ట్ సుడాన్ విమానాశ్రయం ఉంది. ఘర్షణలతో ఇప్పటికే రాజధాని ఖార్టూమ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలుపుదల చేశారు. ప్రస్తుతం పోర్ట్ సుడాన్ ఎయిర్‌పోర్టును మాత్రమే ఆ దేశంలో ప్రధాన ఎయిర్‌పోర్టుగా వినియోగిస్తున్నారు.