హమాస్‌తో పోరాడేందుకు యుద్ధంలోకి దిగిన 95ఏళ్ల ఇజ్రాయెల్ మాజీ సైనికుడు
హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. యుద్ధం నేపథ్యంలో 3లక్షల మంది రిజర్వ్‌డ్ సైన్యాన్ని ఇజ్రాయెల్ నియమించుకుంది. రిజర్వ్ ఆర్మీలో చేరేందుకు ఓ 95ఏళ్ల మాజీ సైనికుడు ముందుకొచ్చి.. దేశంపై తన ప్రేమను చాటుకున్నారు. ఈ వయసులో దేశానికి తన వంతు సేవ చేయాలని వచ్చిన ఆ మాజీ సైనికుడి పేరు ఎజ్రా యాచిన్. 95ఏళ్ల వయసులో హమాస్‌తో పోరాడటానికి యుద్ధ రంగంలోకి దిగారని పేర్కొంటూ న్యూయార్క్ పోస్ట్.. ఆయన సైనికుడిగా ఉన్నప్పటి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇజ్రాయెల్ స్వతంత్ర పోరాట సమయంలో లెహి గ్రూప్‌లో ఎజ్రా యాచిన్ పని చేశారు. ఇజ్రాయెల్ దేశ ఆవిర్భావం, ప్రపంచ యుద్ధాలు, అరబ్బులతో యుద్ధం, ఇలా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు.
యువ సైనికులను ఉత్తేజపర్చేందుకు..
చాలా యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న ఎజ్రా యాచిన్‌తో ప్రస్తుత సమయంలో యువ సైనికులను ఉత్తేజితులను చేయడానికి, తన బాల్యంలో అరబ్బుల నుంచి యూదులు ఎదుర్కొన్న హింస, వివక్ష, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎలా పోరాడి నిలిచించి అనే విషయాలను చెప్పడానికి ఆ దేశ సైన్యం ఆయన్ను రిజర్వ్ ఫోర్స్‌లోకి తీసుకున్నట్లు మీడియా చెబుతోంది. 2021లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఎజ్రా యాచిన్ తన బాల్యం, పోరాటం గురించి వివరించారు. ఇజ్రాయెల్ ఏర్పడక ముందు బ్రిటీష్ వారు యూదులను అనేక విధాలుగా వలసపోకుండా నిరోధించారు కానీ, యూదులను అరబ్బులు హత్య చేయకుండా ఆపలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఆ రోజున మారణహోమం.. ఏరులై పారిన యూదుల రక్తం: ఎజ్రా యాచిన్
అరబ్బుల నుంచి యూదులు తమను తాము రక్షించుకునేందుకు కొన్ని రహస్య సంస్థలను ఏర్పరుచుకున్నట్లు ఎజ్రా యాచిన్ చెప్పారు. అందులో ఒకటైన లెహి సంస్థతో తాను పని చేసినట్లు పేర్కొన్నారు. యూదుల కోసం ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన రోజున ఈ ప్రాంతంలో మారణహోమం జరిగినట్లు ఆయన చెప్పారు. యూదుల కుటుంబాలను అరబ్బులు ఊచకోత కోశారని, తమను బెదరించారని ఎజ్రా యాచిన్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అరబ్బుల సృష్టించిన మారణహోమం వల్ల యూదుల రక్తం వరదలా పారిందని, ఈ విషయంలో బ్రిటిషర్లు వారికి సహాయం చేశారని ఆయన ఆరోపించారు.