Nepal Floods Rescue: శిథిలాల్లో 97 ఏళ్ల వృద్ధురాలు.. నాలుగు గంటల రెస్క్యూ ఆపరేషన్‌తో సేఫ్
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శిథిలాల్లో చిక్కుకున్న 97 ఏళ్ల వృద్ధురాలిని రెస్క్యూ బృందాలు నాలుగు గంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. వృద్ధురాలిని రక్షించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నువాకోట్ జిల్లాలోని టుప్చేలో ఓ సంరక్షణ గృహంలో గుణ మాయా బొహారా అనే 97 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆమె ఉంటున్న భవనం కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న బొహారా సమీప బంధువులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆ భవనం ఉన్న ప్రాంతం మొత్తం మట్టి దిబ్బగా మారడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
వివరాలు
సురక్షితంగా బయటకు తీశారు
చెట్లకు కట్టిన తాళ్ల సహాయంతో ఎంతో కష్టపడి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఉన్న వారంతా మృతిచెందినట్లు కనిపించగా.. బొహారా మాత్రం శిథిలాల్లో సగానికిపైగా కూరుకుపోయిన స్థితిలో ప్రాణాలతో కనిపించారు.
ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన బంధువులు వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని వృద్ధురాలిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.
సుమారు నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ బృందాలు చివరకు బొహారాను శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.
అనంతరం ఆమెను కాఠ్‌మండూలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.