Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష
చైనాలోని గుజావ్ ప్రావిన్స్‌లో జాంగ్ యాంగ్ అనే మహిళా అధికారి అతి పెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది. ఆమె తన పదవిని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత లాభాల కోసం వివిధ దురాక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారించడంతో ఆమెకు కోర్టు 13 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జాంగ్ యాంగ్(52) తన అందంతో పలు రాజకీయ నాయకులతో అక్రమ సంబంధాలకు తెరతీసింది. ఈ క్రమంలోనే దాదాపు 60 మిలియన్ల యువాన్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీపీసీ పార్టీ గవర్నర్‌గా, డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన జాంగ్, ప్రజల మధ్య "బ్యూటీఫుల్ గవర్నర్" అనే పేరును తెచ్చుకున్నారు.
సీపీసీ నుంచి తొలగింపు
అధికారాన్ని ఉపయోగించి, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులలో అవినీతి వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. జాంగ్ 58 మంది సీనియర్ అధికారులతో అక్రమ సంబంధాలు కలిగి ఉందని విచారణలో తేలింది. ఈ విషయాన్ని పరిగణించి ఆమెకు జైలుశిక్షతో పాటు సుమారు కోటిన్నర రూపాయల జరిమానా విధించారు. జాంగ్ యాంగ్ 22 ఏళ్ల వయస్సులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. రైతుల సాయార్థం కోసం ఫ్రూట్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్‌ను స్థాపించింది. అయితే ప్రభుత్వ పెట్టుబడులను తప్పుడు విధానాల కోసం ఉపయోగించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమెను అధికారికంగా పదవి నుంచి తొలగించారు. మరోవైపు సీపీసీ నుంచి బహిష్కరించారు.