
China: ఒక చేప కోసం కీలక నిర్ణయం.. 300 డ్యామ్‌లను కూల్చిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక చర్యలకు పాల్పడుతోంది. దేశంలో ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది. అలాగే 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్న హైడ్రోపవర్ ప్రాజెక్టుల కార్యకలాపాలు నిలిపివేసింది. ఈ నిర్ణయాల వెనుక ప్రధాన ఉద్దేశ్యం నదుల సహజ ప్రవాహాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడటం. ఒక చేప కోసం మొదలైన ఉద్యమం 2020లో ప్రారంభించిన ఈ చర్యలు యాంగ్జీ నదిలోని స్థానిక చేప జాతులను, సహజ ఉనికిని కాపాడే లక్ష్యంతో తీసుకున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఇటువంటి చర్యలు చిషుయ్ హే (రెడ్ రివర్) వంటి ఉపనదుల్లో చేపల జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు దోహదం చేస్తున్నాయి.
Details
స్టర్జన్‌కు గుండెచప్పుడు లాంటి నది
ఆసియాలో అతి పొడవైన నదిగా గుర్తింపు పొందిన యాంగ్జీ నది, చైనా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థకు కీలకం. గత దశాబ్దాల్లో, భారీ స్థాయిలో డ్యామ్‌లు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు నిర్మించినందుకు నదిలో జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింది. యాంగ్జీ స్టర్జన్ (Yangtze Sturgeon)గా పిలవబడే అరుదైన చేప 2022లో అధికారికంగా అంతరించిన జాతిగా గుర్తింపు పొందింది. 1970ల నుంచి ఇది గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. దీనికి కారణంగా డ్యామ్‌లు, అతిగా చేపలు పట్టడం వంటి మానవ చర్యలే నిలిచాయి.
Details
మళ్లీ జీవానికి ఆశ
చైనా చేపట్టిన రెడ్ రివర్ పునరుద్ధరణ ప్రాజెక్టు వల్ల తాజాగా జీవవైవిధ్యంలో మార్పులు కనిపిస్తున్నాయి. 2023, 2024లో రెండు బ్యాచ్‌ల స్టర్జన్‌లను నదిలోకి వదిలారు. శాస్త్రవేత్తల ప్రకారం అవి విజయవంతంగా తమ జీవన ప్రణాళికను నదిలో కొనసాగించడాన్ని ప్రారంభించాయి. ఇది నదీ జీవవైవిధ్య పునరుద్ధరణలో ఒక గొప్ప విజయం అని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Details
డ్యామ్‌ల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు?
స్థానిక నదీప్రవాహం అడ్డంకిపడడం వల్ల చేపల వలస, ఉత్పత్తి అంతరాయం. చిషుయ్ హే వంటి ఉపనదుల్లో నీరు తగ్గి, కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఎండిపోయాయి. కొన్ని చేప జాతులు పూర్తిగా కనిపించకుండా పోయే పరిస్థితి. చైనా తీసుకుంటున్న ఈ విధానాలు పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. డ్యామ్‌లు కూల్చటం, చిన్న పవర్‌స్టేషన్లను మూసివేయడం అనేవి వ్యాపారపరంగా సమర్ధించదగినవి కాకపోయినా భవిష్యత్తులో ప్రకృతి సుస్థిరత కోసం తీసుకుంటున్న విలువైన ప్రయత్నాలుగా పరిగణించవచ్చు.