
Alzheimers: చైనాలో అల్జీమర్స్ శస్త్రచికిత్స నిలిపివేత.. ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అల్జీమర్స్ వ్యాధికి చికిత్సగా చైనాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక శస్త్రచికిత్సా విధానంపై అక్కడి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 'లింఫాటిక్ వేనస్ అనస్టోమోసిస్' (LVA surgery) అనే ఈ సర్జరీ పద్ధతి సురక్షితమో, సమర్థమో అనే దానిపై తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంటూ చైనా నేషనల్ హెల్త్ కమిషన్ దానిపై నిషేధం విధించింది. గత నాలుగేళ్లుగా దేశవ్యాప్తంగా దాదాపు 400 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనసాగిన ఈ చికిత్సా విధానానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విధానాన్ని తొలిసారి 2021లో ఝేజియాంగ్ ప్రావిన్సులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన మైక్రోసర్జరీ నిపుణుడు అల్జీమర్స్ రోగిపై ప్రయోగాత్మకంగా ఉపయోగించారు.
Details
సరైన ఆధారాలు లేవు
తొలి ఏడాదిలోనే ఇది ప్రాచుర్యం పొందింది. అప్పటినుంచి 2024 వరకూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 382 ఆసుపత్రులు ఈ చికిత్సను అందించడం ప్రారంభించాయి. కొన్ని వీడియోల్లో 60 నుంచి 80 శాతం రోగుల్లో ఈ సర్జరీ విజయవంతమైందని పేర్కొంటూ డాక్టర్లు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. అయితే దీనిపై వైద్యవర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ, కొంతమంది నిపుణులు ఆందోళనకు లోనవ్వడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ చికిత్సను అనుమతులు లేకుండానే చేపడుతున్న ఆసుపత్రుల తమ దృష్టికి వచ్చిందని, కానీ దీని ప్రభావశీలత, భద్రతను నిర్థారించేందుకు సరైన ఆధారాలు లేవని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Details
మందుల ద్వారా లక్షణాలను కంట్రోల్ చేయొచ్చు
అందుకే తక్షణమే ఎల్‌వీఏ సర్జరీను నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అల్జీమర్స్ అనేది మానవ నాడీవ్యవస్థకు సంబంధించిన క్షీణత రుగ్మత. దీని లక్షణాల్లో జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచన శక్తి, నేర్చుకునే సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాల్లో తగ్గుదల ముఖ్యమైనవి. ప్రస్తుతం దీనికి పూర్తి స్థాయిలో వ్యాధినిరోధక చికిత్స లేదు. కానీ కొన్ని మందుల ద్వారా లక్షణాలను కంట్రోల్ చేయడం సాధ్యమవుతోంది.