LOADING...
South Sudan: దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్.. పైలట్ చాకచక్యంతో తప్పిన అపాయం
దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్.. పైలట్ చాకచక్యంతో తప్పిన అపాయం

South Sudan: దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్.. పైలట్ చాకచక్యంతో తప్పిన అపాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ సూడాన్‌లో సహాయక కార్యకలాపాల కోసం ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం హైజాక్ ఘటనకు గురైంది. నిందితుడు విమానాన్ని ఆఫ్రికా దేశమైన చాద్‌కు మళ్లించాలని పైలట్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తూ ఇంధనం నింపాల్సి ఉందని చెప్పి విమానాన్ని మరో ప్రాంతానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. అక్కడ ముందుగానే అప్రమత్తమైన పోలీసులు హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

టేకాఫ్‌కు ముందు.. దొంగచాటుగా ప్రవేశించి

అధికారుల వివరాల మేరకు.. మంగళవారం సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి మైవుట్‌కు వైద్య సరుకులను తరలిస్తూ బయలుదేరింది. టేకాఫ్‌కు ముందు తుపాకీతో ఉన్న ఓ వ్యక్తి విమానంలోకి దొంగచాటుగా ప్రవేశించి వెనుక క్యాబిన్‌లో దాక్కున్నాడు. అబై ప్రాంతానికి చెందిన యాసిర్ మహమ్మద్ యూసఫ్‌గా అతడిని గుర్తించారు. విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత అతడు హైజాక్ చేసి చాద్‌కు మళ్లించాలని పైలట్‌ను ఒత్తిడి చేశాడు. దీంతో విమానం కొన్ని గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైజాక్ పరిస్థితుల్లో పైలట్ ఎంతో ధైర్యంగా, తెలివిగా వ్యవహరించాడు. ఇంధనం నింపాల్సి ఉందని కారణం చూపించి, హైజాకర్ సూచించిన ప్రదేశానికి కాకుండా వావులో విమానాన్ని ల్యాండ్ చేశాడు.

వివరాలు 

భద్రతా దళాలకు కృతజ్ఞతలు

అక్కడి అధికారులకు వెంటనే సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. హైజాక్‌కు సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొంటూ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక, నిందితుడు జుబా అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఎయిర్ చార్టర్ కంపెనీ లోగో ఉన్న చొక్కా ధరించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అయితే అతడు ఆ సంస్థలో ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విమాన కంపెనీ ప్రతినిధి మెలిస్సా స్ట్రీక్‌ల్యాండ్ స్పందిస్తూ.. విమానాన్ని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement