న్యూజిలాండ్: చైనీస్ రెస్టారెంట్లే లక్ష్యంగా గొడ్డలితో దాడి; నలుగురికి గాయాలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలోని మూడు చైనీస్ రెస్టారెంట్లలో గొడ్డలితో ఒక వ్యక్తి హల్‌చల్ చేసాడు. రెస్టారెంట్లలో తింటున్న కస్టమర్లపై గొడ్డలితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఒక బాధితుడు డిశ్చార్జ్ అయ్యాడని, ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని నార్త్ షోర్, ఆక్లాండ్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 24 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉంది.