LOADING...
Rob Jetten: ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం.. మొట్టమొదటి ప్రధానమంత్రిగా  గే ఎంపిక!
ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం.. మొట్టమొదటి ప్రధానమంత్రిగా గే ఎంపిక!

Rob Jetten: ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం.. మొట్టమొదటి ప్రధానమంత్రిగా  గే ఎంపిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెదర్లాండ్స్‌ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది. అక్టోబర్‌ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డచ్‌ సెంట్రిస్ట్‌ పార్టీ D66 ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా పార్టీ నాయకుడు, 38 ఏళ్ల రాబ్‌ జెట్టెన్‌ దేశంలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుడు, అలాగే అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా అవతరించబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా జెట్టెన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం అతిపెద్ద పార్టీగా అవతరించడం చారిత్రాత్మక విజయం. కానీ, దానితో పాటు పెద్ద బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు.

Details

ఉత్కంఠభరితంగా ఎన్నికలు

నెదర్లాండ్స్‌లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇస్లాం వ్యతిరేక నేత గీర్ట్ వైల్డర్స్‌ను జెట్టెన్‌ ఓడించాడు. వైల్డర్స్‌ వలస వ్యతిరేకత, ఖురాన్‌పై నిషేధం వంటి వివాదాస్పద అంశాలతో ప్రచారం చేసినా.. ప్రజాదరణ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశాల్లో నివసించే డచ్‌ పౌరుల ఓట్ల లెక్కింపు పూర్తైన నవంబర్‌ 3న తుది ఫలితాలు ప్రకటించనున్నారు.

Details

ఇది సాధ్యమే.. జెట్టెన్‌ నినాదం 

రెండు సంవత్సరాల క్రితం వరకు ఐదవ స్థానంలో ఉన్న D66 పార్టీ, జెట్టెన్‌ నాయకత్వంలో అగ్రస్థానానికి ఎదిగింది. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 'Yes We Can' నినాదం నుంచి ప్రేరణ పొంది, ఇది సాధ్యమే అనే సానుకూల సందేశంతో ప్రజల్లోకి వెళ్లారు. జెట్టెన్ మాట్లాడుతూ గీర్ట్ వైల్డర్స్‌ సమాజంలో ద్వేషాన్ని, విభజనను వ్యాప్తి చేస్తున్నారు. కానీ, సానుకూల ప్రచారంతో ప్రజాకర్షక శక్తులను ఓడించవచ్చని మేము ప్రపంచానికి చూపించామని అన్నారు. నెదర్లాండ్స్‌లో గత కొన్నేళ్లుగా ప్రతికూల వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ వాతావరణాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. యూరోప్‌ మద్దతు లేకుండా మనం శూన్యం కాబట్టి, నెదర్లాండ్స్‌ తిరిగి యూరప్‌ కేంద్రంలో నిలవాలని జట్టెన్‌ అన్నారు.

Details

రాబ్‌ జెట్టెన్‌ వ్యక్తిగత జీవితం

రాబ్‌ జట్టెన్‌ ఆగ్నేయ నెదర్లాండ్స్‌లోని ఉడెన్‌ నగరంలో జన్మించారు. ఆయన నీమెయర్‌లోని రాడ్‌బౌడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రజా పరిపాలనను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ పట్ల ఆసక్తి చూపేవారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ పాఠశాల ఉపాధ్యాయులు. ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా మార్చాలని ఎప్పటినుంచో కోరుకున్నానని ఆయన చెప్పారు. జట్టెన్‌ మొదట్లో తన కెరీర్‌ను క్రీడలు లేదా హోటల్‌ రంగంలో కొనసాగించాలని భావించాడు. వెచ్చని దేశంలో సముద్రతీరంలోని రెస్టారెంట్‌ ప్రారంభించాలని అనుకున్నాను, కానీ జీవితం నన్ను వేరే దిశలో తీసుకెళ్లింది.

Details

నికోలస్‌ కీనన్‌తో నిశ్చితార్థం

అయితే ఇప్పుడు నాకు నెదర్లాండ్స్‌లో అత్యంత అందమైన ఉద్యోగం దక్కిందని గర్వంగా చెప్పగలనని ఆయన చెప్పారు. అంతేకాకుండా, రాబ్‌ జట్టెన్‌ అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్‌ కీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ వచ్చే ఏడాది స్పెయిన్‌లో వివాహం చేసుకోనున్నారు. మొత్తంగా, రాబ్‌ జట్టెన్‌ నాయకత్వంలో నెదర్లాండ్స్‌ రాజకీయాల్లో కొత్త దిశ ప్రారంభమవుతుందనే ఉత్సాహం దేశమంతా నెలకొంది.