స్వలింగ జంటకు హక్కులను గుర్తిస్తూ హైకోర్టు సంచలన తీర్పు
దక్షిణ కొరియా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆ దేశంలో తొలిసారిగా స్వలింగ సంపర్కానికి చట్టబద్ధతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ద్వారా ఇతర జంటలకు అందించే ప్రయోజనాలకు స్వలింగ ఆధారిత వ్యక్తి అనర్హుడనే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుపట్టింది. స్వలింగ సంపర్కులకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందించాలని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును స్వలింగ జంట అయిన సో సుంగ్ వూక్, కిమ్ యోంగ్ మిన్ తరఫున వాదించిన న్యాయవాది ర్యూ మిన్-హీ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వలింగ జంటల చట్టపరమైన స్థితికి మొదటి గుర్తింపు అని ప్రకటించారు.
మైనారిటీల హక్కులను పరిరక్షించడం న్యాయస్థానం అతిపెద్ద బాధ్యత: హైకోర్టు
స్వలింగ జంట అయిన సో సుంగ్ వూక్, కిమ్ యోంగ్ మిన్ కూడా హైకోర్టు తీర్పుపై స్పందించారు. ఇది తమ విజయం మాత్రమే కాదని, స్వలింగ జంటల విజయం అన్నారు. తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఆరోగ్య బీమా పథకాన్ని స్వలింగ సంబంధాల్లో ఉన్న వ్యక్తులకు వర్తింపజేయకపోవడం వివక్ష కిందకు వస్తుందని పేర్కొంది. మైనారిటీల హక్కులను పరిరక్షించడం అనేది న్యాయస్థానం అతిపెద్ద బాధ్యత స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ వెల్లడించింది.