Putin's Secret Residence: ఫిన్లాండ్ సమీపంలో పుతిన్ రహస్య నివాసం గుర్తింపు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన సీక్రెట్ విషయం బయటకు వచ్చింది. ఫిన్‌లాండ్- రష్యా సరిహద్దు సమీపంలో పుతిన్ రహస్య నివాసానికి సంబంధించిన విషయాన్ని పరిశోధన సంస్థ 'డాసియర్ సెంటర్' బయటపెట్టింది. డోసియర్ సెంటర్ యూట్యూబ్ ఛానెల్‌లో విలాసవంతమైన ఎస్టేట్ డ్రోన్ ఫుటేజీని 'పుతిన్స్ సీక్రెట్ కంట్రీ హౌస్' పేరుతో విడుదల చేసింది. ఫిన్లాండ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో గల రష్యా సరిహద్దుల్లోని రిపబ్లిక్ ఆఫ్ కరెలీనాలో పుతిన్ రహస్య నివాసం ఉంది. మర్జలహటి బే వద్ద ఈ రహస్య ఇంటి సముదాయం ఉండగా.. అందులో మూడు అత్యాధునిక భవనాలు ఉన్నాయి. ఈ సముదాయం ప్రాంగణంలో రెండు హెలిపాడ్లను కూడా ఉన్నాయి.
రహస్య నివాసానికి 24గంటల గస్తీ
నదికి సమీపంలో ఉండే రహస్య నివాసం సముదాయంలో విలాసవంతమైన పడవలను నిలిపేలా ఏర్పాట్లను చేశారు. అంతేకాకుండా, గొడ్డు మాంసం కోసం వ్యవసాయ భూమిని కూడా సిద్ధం చేసినట్లు డ్రోన్ దృశ్యాల ద్వారా తెలుస్తుంది. అలాగే పుతిన్ రహస్య నివాసం సముదాయం సమీపంలో జలపాతం కూడా ఉంది. దీనిని పుతిన్ స్కెర్రీస్ నేషనల్ పార్క్ నుంచి అక్రమంగా దక్కించుకున్నట్లు 'డోసియర్ సెంటర్' ఆరోపిస్తోంది. ఇక్కడ 24 గంటలపాటు గస్తీ ఉంటుంది. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను పుతిన్ చేసిన ట్లు 'డోసియర్ సెంటర్' తెలిపింది. ఈ రహస్య నిర్మాణం 10 ఏళ్ల కిందటే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ రహస్య నివాసానికి పుతిన్ ఏటా ఒకసారి వస్తారట.