Mohammed Al-Jolani: సిరియన్ తిరుగుబాటుదారుల HTS నాయకుడు అబూ మొహమ్మద్ అల్-జోలానీ ఎవరు?
సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటుద్వారా కూలదోసి అధికారం చేజిక్కించుకున్న ఇస్లామిక్ అలయెన్స్ నాయకుడు, 45 ఏళ్ల అబూ మహ్మద్ జొలాని గురించి వార్తల్లో వినిపిస్తోంది. అయితే, ఎవరీ జొలాని? ఏంటి ఈయన జీవన ప్రయాణం? అనే ప్రశ్నలు సహజంగా ఎదురవుతాయి. 1982లో సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని మజె పట్టణంలో జన్మించిన జొలాని మూలాలు పాలస్తీనాలో ఉన్నాయి. 1967లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు జొలానీ తాత గొలాన్ హైట్స్ ప్రాంతం నుంచి శరణార్థిగా సిరియాకు బలవంతంగా తరలించబడ్డాడు. జొలాని తన జీవితాన్ని జిహాదిస్టుగా ప్రారంభించి,అనేక మలుపులు తిరిగాడు. ఆయన ఉగ్రవాద జీవితానికి పునాది అల్ ఖైదా సంస్థలో పడి,అక్కడ సభ్యుడిగా మారడం. అయిదేళ్ల నిర్బంధం అనంతరం ఇరాక్‌లో జిహాదిస్టుగా శిక్షణ పొందాడు.
అల్ నుస్రా ఫ్రంట్ పేరుతో ఇస్లామిక్ అలయెన్స్‌ను ఏర్పాటు
2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఇరాక్‌పై దాడి చేసినప్పుడు,జొలాని స్వదేశమైన సిరియాకు తిరిగి వచ్చి,అల్ ఖైదా సిరియా శాఖగా హయత్ తెహ్రిర్ అల్ షామ్(హెచ్‌టిఎస్)ను స్థాపించాడు. 2011లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటులో జొలాని కీలక పాత్ర పోషించాడు. అమెరికా,ఇజ్రాయిల్, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో సిరియాలో ఇస్లామిస్ట్ తీవ్రవాద గ్రూపులు, స్థానిక మిలీషియాలను కలుపుకుని,అల్ నుస్రా ఫ్రంట్ పేరుతో ఇస్లామిక్ అలయెన్స్‌ను ఏర్పాటు చేశాడు. 2013లో అల్ ఖైదా నుంచి విడిపోయి,ఐసిస్ స్థాపించిన అబూ బకర్ ఆగమనాన్ని జొలాని తిరస్కరించి, అల్ ఖైదాపట్ల విధేయతను చాటుకున్నాడు. అనంతరం,అసద్ ప్రభుత్వ వ్యతిరేక అన్ని గ్రూపులను ఒకటిగా చేర్చి,పశ్చిమ దేశాల మద్దతుతో అసద్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.